కమల్‌నాథ్ బలపరీక్షకు బ్రేక్ వేసిన కరోనా వైరస్!
ABN , First Publish Date - 2020-03-16T17:46:00+05:30 IST
22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో రసకందాయంలో పడిన మధ్య ప్రదేశ్ హైడ్రామా ఇవాళ ఊహించని మలుపుతీసుకుంది...
న్యూఢిల్లీ: 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో రసకందాయంలో పడిన మధ్య ప్రదేశ్ రాజకీయ హైడ్రామా ఇవాళ ఊహించని మలుపుతీసుకుంది. కరోనా వైరస్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు. ఇవాళ కమల్‌నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాలను సైతం స్పీకర్ పక్కనబెట్టారు. దీంతో సీఎం కమల్‌నాథ్‌కు మరో పది రోజుల పాటు రిలీఫ్ దొరికినట్టైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.
కాగా ఇవాళ ఉదయం అసెంబ్లీకి వచ్చిన కొద్ది సేపటికే గవర్నర్ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. ‘‘శాసన సభను గౌరవించాలి’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆయన వెంటనే అసెంబ్లీని వీడి వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో భాగంగా గవర్నర్ టాండన్ మాట్లాడుతూ.. ‘‘మధ్య ప్రదేశ్ ప్రతిష్టను కాపాడేందుకు అందరూ రాజ్యాంగాన్ని అనుసరించాలి’’ అని పేర్కొనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాదాలు చేశారు. కాగా అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనీ... స్పీకర్ నిర్ణయాలను గౌరవించాలంటూ ఇవాళ ఉదయం గవర్నర్‌కు ముఖ్యమంత్రి కమల్ నాధ్ లేఖ రాయడం గమనార్హం.