సినిమాల్లో పోలీసు వేషాలు వేసే ఆ నటుని నిజస్వరూపం ఇదే...
ABN , First Publish Date - 2020-06-22T11:33:04+05:30 IST
భారీ స్థాయిలో లగ్జరీ కార్లను దొంగిలించే ముఠాను యూపీలోని లక్నో పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో సభ్యులైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 కోట్ల విలువైన...

లక్నో: భారీ స్థాయిలో లగ్జరీ కార్లను దొంగిలించే ముఠాను యూపీలోని లక్నో పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో సభ్యులైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 కోట్ల విలువైన 50 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో భోజ్‌పురి నటుడు నాసిర్ కూడా ఉన్నాడు. ఈ ముఠా గుట్టు రట్టుచేసిన సందర్భంగా లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చోరీకి గురైన వాహనాలను కొనుగోలు చేసి, విక్రయించే ఈ ముఠాపై మాటువేసి లక్నోలో పట్టుకున్నామన్నారు. వారి నుండి బిఎమ్‌డబ్ల్యూ, ఇన్నోవా లాంటి 50 లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఈ ముఠాలో సభ్యునిగా ఉన్న నాసిర్ మూడు భోజ్‌పురి చిత్రాల్లో పోలీసు పాత్రలు పోషించాడు. కాగా వీరు తమ అక్రమ కార్యకలాపాలను నేపాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హరియాణాతో సహా పలు రాష్ట్రాలలో కొనసాగించారని పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ ముఠా సభ్యలు వాహనాలను దొంగిలించి, వాటికి మరమ్మతు చేసిన తరువాత వాటిని విక్రయిస్తుంటారన్నారు. ఈ ముఠాలో కొంతమంది కార్లను దొంగతనం చేస్తారు. మరికొందరు వాటికి మరమ్మతులు చేయిస్తుండగా, మిగిలినవారు వాటి విక్రయంతో పాటు వాహన బీమా పనులనుచేస్తారు. ఈ వ్యవహారంలో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ హస్తం కూడా ఉందని తెలుస్తోంది. కాగా ఈ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వారి దగ్గర ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేసేందుకు సంప్రదించి, చాకచక్యంగా పట్టుకున్నారు.