లక్నోలో హోర్డింగ్‌‌లు... హైకోర్టు సుమోటో విచారణ

ABN , First Publish Date - 2020-03-08T18:21:30+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తుల పేర్లు, వారి ఫోటోలు, అడ్రస్సులతో కూడిన హోర్డింగ్‌లను..

లక్నోలో హోర్డింగ్‌‌లు...  హైకోర్టు సుమోటో విచారణ

లక్నో: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తుల పేర్లు, వారి ఫోటోలు, అడ్రస్సులతో కూడిన హోర్డింగ్‌లను లక్నో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయడం సంచలనమైంది. లక్నోలోని ఓ ప్రముఖ కూడలిలో ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న లక్నో హైకోర్టు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనిపై విచారణ చేపట్టనుంది. నగరంలోని కీలక కూడలిలో ఏ చట్టం ప్రకారం ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలంటూ లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే, జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాష్‌లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమష్ సిన్హా ఆదేశించారు.


దీనికి ముందు, శుక్రవారం రాత్రి లక్నోలోని  ప్రధాన కూడళ్లలో ఈ హోర్డింగ్‌లు వెలిసాయి. వీటిపై 53 మంది సీఏఏ వ్యతిరేక నిరసనకారుల ఫోటోలు, చిరునామాలు ఉన్నాయి. సామాజిక కార్యకర్త-రాజకీయ నేత సదఫ్ జఫర్, న్యాయవాది మొహమ్మద్ షోయిబ్, రంగస్థల నటుడు దీపక్ కబీర్, మాజీ ఐపీఎస్ అధికారి ఎస్.ఆర్.దారాపురిల ఫోటోలు కూడా ఈ హోర్డింగ్‌ల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరంతా బెయిలుపై ఉన్నారు.


లక్నోలో ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన నిరసనకారులు తక్షణం పరిహారం చెల్లించాలని కూడా ఆ హోర్డింగ్‌లపై రాసి ఉంది. పరిహారం చెల్లడంలో విఫలమైతే వారి ఆస్తులు జప్తు చేస్తామని ప్రభుత్వం యంత్రాంగం హెచ్చరించింది.


నిరసనల సమయంలో హింసాయుత కార్యకలాపాలకు పాల్పడినట్టు గుర్తించిన వ్యక్తులు, చిరునామాలతో నగరవ్యాప్తంగా 100 చోట్ల హోర్డింగ్‌లు ఉంచుతామని, ప్రజా ఆస్తుల ధ్వంసానికి పరిహారం చెల్లించకుంటే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఇటీవల లక్నో జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు.

Updated Date - 2020-03-08T18:21:30+05:30 IST