బంగాళాఖాతంలో అల్పపీడనం... ఈ నెల 16నాటికి తుపానుగా మారే అవకాశం...

ABN , First Publish Date - 2020-05-13T22:41:01+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఈ నెల 16నాటికి తుపానుగా మారే అవకాశం...

న్యూఢిల్లీ : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. ఈ  అల్ప పీడనం బలపడి, ఈ నెల 16 సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. 


ఈ  అల్ప పీడనం బలపడి, తుపానుగా మారితే, దీనికి ‘అంఫన్’ అని పేరు పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ తుపాను ప్రారంభంలో ఈ నెల 17 వరకు నైరుతి దిశగా కదులుతుందని, ఆ తర్వాత ఉత్తర-నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. 


ఇండియా మెటియరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో, ‘‘ఆగ్నేయ బంగాళాఖాతంలో, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా, బుధవారం, మే 13 ఉదయం, అల్ప పీడనం ఏర్పడింది. ఈ నెల 15న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగంపై వాయుగుండంగా బలపడవచ్చు. ఆ తర్వాత ఈ నెల 16 సాయంత్రానికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది ఈ నెల 17 వరకు నైరుతి దిశగా కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర-నైరుతి దిశగా కదిలే అవకాశం ఉంది’’ అని తెలిపింది.


ఈ నెల 15, 16 తేదీల్లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజుల్లో అండమాన్ దీవుల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కూడా పడవచ్చునని తెలిపింది.


ఈ నెల 15 నుంచి మత్స్యకారులు సముద్రంపైకి వెళ్లరాదని హెచ్చరించింది.


Read more