ఈ పరిస్థితుల్లో రథయాత్రకు అంగీకరిస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు: సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2020-06-18T19:09:42+05:30 IST
ప్రతియేటా అత్యంత వైభవోపేతంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రస్తుతం కరోనా విపత్తు నేపథ్యంలో

ఒడిసా/న్యూఢిల్లీ: ప్రతియేటా అత్యంత వైభవోపేతంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రస్తుతం కరోనా విపత్తు నేపథ్యంలో రథయాత్రను నిర్వహించకపోవడమే మేలని వ్యాఖ్యానించింది. ’ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహణకు మేం అంగీకరిస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు..‘ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా జగన్నాథుడి రథయాత్రను, దానికి సంబంధించిన కార్యకలాపాలను ఈ సంవత్సరం అనుమతించబోమని కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. జూన్ 23 న ప్రారంభం కానున్న రథయాత్రను వాయిదా వేయాలంటూ ఓ పిటీషనర్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం.. రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపై స్టే విధించారు.
కాగా.. ఈ యేడాది పూరీ జగన్నాథుని రథయాత్రను అశేష భక్తజనం లేకుండానే నిర్వహిస్తామని మే నెలాఖరున శ్రీ జగన్నాథ్ ఆలయ కమిటీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.. ఆలయ కమిటీ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒడిశా సర్కార్.... రథ యాత్ర సందర్భంలో ప్రత్యేకంగా రైళ్లు వేయాల్సిన అవసరం ఏమీ లేదని కేంద్ర రైల్వే శాఖకు తేల్చి చెప్పింది. లక్షలాది భక్తుల వీక్షణార్థం అన్ని మీడియా ఛానళ్లలోనూ రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, అప్పుడు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ‘‘ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వివిధ పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే రథను నిర్వహించాలని డిసైడ్ అయ్యాం. రథయాత్రపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.’’ అని ఆలయ కమిటీ అధ్యక్షుడు గజపతి మహారాజా అన్నారు. కాగా.. సుప్రీం తీర్పును బట్టి శ్రీ జగన్నాథ్ ఆలయ కమిటీ ఏం చేయబోతోందో వేచిచూడాలి.