లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారితో కరోనా రోగులకు సేవలు!

ABN , First Publish Date - 2020-03-29T00:15:15+05:30 IST

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు రాజస్థాన్‌లోని ఝున్హువా జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. ..

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారితో కరోనా రోగులకు సేవలు!

జైపూర్: లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు రాజస్థాన్‌లోని ఝున్హువా జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై అకారణంగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బయటికి వస్తే...  క్వారంటైన్ వార్డులకు పంపి కరోనా రోగులకు సేవలు చేయించనున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అకారణంగా లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిని స్థానిక ప్రజలు కూడా ఫోటోలు తీసి జిల్లా యంత్రాంగానికి పంపాలంటూ నావల్‌గఢ్ ఎస్‌డీఎం మురారీ లాల్ శర్మ కోరారు. ‘‘లాక్‌‌డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జి గానీ, అరెస్టుగానీ చేయకూడదని నిర్ణయించాం. క్వారంటైన్ వార్డుల్లో శానిటైజింగ్ చేసేందుకు అలాంటి వారి సేవలు ఉపయోగించుకుంటాం. కరోనా రోగులకు సేవలు అందించే బాధ్యతలను వారికి అప్పగిస్తాం..’’ అని ఆయన పేర్కొన్నారు. జేజేటీ యూనివర్సిటీ, సింఘానియా యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ వార్డుల్లో వారితో పనిచేయిస్తామని వెల్లడించారు.


కాగా తమ నిర్ణయంపై ప్రజల్లో బలంగా అవగాహన కల్పించేందుకు అధికారులు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘‘ఇది జోక్ కాదు. ఆదివారం నుంచి మేము దీన్ని అమలు చేయబోతున్నాం. కోవిడ్-19 పేషెంట్లకు సేవలు అందించే వారు చాలా తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా అటు క్వారంటైన్ వార్డుల్లో సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు ఇటు లాక్‌డౌన్ ఉల్లంఘనులకు కూడా చెక్ పెట్టేందుకు అవకాశం దొరుకుతుంది...’’ అని ఎస్‌డీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన రోగుల సంఖ్య 54కు చేరినట్టు రాజస్తాన్ ప్రకటించింది. 

Updated Date - 2020-03-29T00:15:15+05:30 IST