గుర్తింపు దక్కని హీరోలు!
ABN , First Publish Date - 2020-04-05T05:57:04+05:30 IST
కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బందిని దేవుళ్లుగా భావిస్తున్నాం. దేశమంతా లాక్‌డౌన్ అమలవుతున్నా.. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలనూ కొనియాడుతున్నాం.

24 గంటలూ విధుల్లో మైక్రోబయాలజిస్టులు
ఎన్‌ఐసీఈడీ ల్యాబ్ సిబ్బంది అంకితభావం
కోల్‌కతా, ఏప్రిల్ 4: కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బందిని దేవుళ్లుగా భావిస్తున్నాం. దేశమంతా లాక్‌డౌన్ అమలవుతున్నా.. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలనూ కొనియాడుతున్నాం. కానీ.. వీళ్లలాగే మైక్రోబయాలజిస్టులు కూడా 24 గంటలూ పనిచేస్తూ కొవిడ్-19 బాధితులను గుర్తించే పనిలో నిమగ్నయ్యారు. కానీ వారంతా గుర్తింపు దక్కని హీరోలుగా మిగిలిపోతున్నారు. కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ (ఎన్‌ఐసీఈడీ) వైరాలజీ ల్యాబ్‌లో 18 మంది సిబ్బంది రోజుకు సగటున 13 నుంచి 14 గంటలు చొప్పున పనిచేస్తున్నారు. వారిలో ఒకరికి ఇటీవలే వివాహమైంది. భార్యను ఇంటి దగ్గరే వదిలిపెట్టి ఇక్కడ వైరస్‌ను నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యాడు. మరొక వ్యక్తి హాస్టల్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అయినా వారు ఆపత్కాలంలో దేశం కోసం పనిచేస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్న వారి నుంచి సేకరించిన నమూనాలు ఈ ల్యాబ్‌కు వస్తే.. వాటిని పరీక్షించడం, రిపోర్టులు తయారుచేయడం, తిరిగి పంపించడం వంటి ఊపిరి సలపని పనులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ‘గతంలో రోజుకు ఒకటి రెండు శాంపిల్స్ వచ్చేవి. కానీ కరోనా నేపథ్యంలో నాలుగు వారాలుగా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు రోజుకి 70కి పైగా శాంపిల్స్ వస్తున్నాయి. పైగా రోజుకు 500 ఫోన్‌కాల్స్ వస్తాయి. నివేదికల్లో ఏదైనా సందేహాలుంటే ఆస్పత్రి వాళ్లు వాటిని నివృత్తి చేసుకోవడానికి ఫోన్లు చేస్తుంటారు.
సాధారణ జనం కూడా ఫోన్లు చేస్తుంటారు. వారు బాధలో ఉన్నారు కాబట్టి మేం విసుక్కోకుండా అందరికీ సమాధానం ఇస్తాం’ అని ఎన్‌ఐసీఈడీలో పనిచేస్తున్న అగ్నివా మజుందార్ తెలిపారు. వాస్తవానికి ఒక శాంపిల్ స్వీకరించడం మొదలుకొని దాన్ని పరీక్షించి నివేదిక తయారు చేసి పంపించే వరకూ సుమారు 4 - 5 గంటల సమయం పడుతుంది. దీంతో తమ బృందం 24 గంటలూ పనిచేస్తోందని మజుందార్ పేర్కొన్నారు. ఆశిష్ కుమార్ జనా అనే మైక్రోబయాలజిస్ట్ ఫిబ్రవరిలో జరిగిన తన వివాహానికి కూడా రెండురోజులు మాత్రమే సెలవు తీసుకున్నారు. తమ బృందంలోని టెక్నీషియన్ ఒకరు హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతారని, అయితే కరోనా టెస్టులు చేస్తున్న అతనికి కూడా వైరస్ సోకుతుందన్న అనుమానంతో అతన్ని హాస్టల్ నుంచి పంపించివేశారని జనా తెలిపారు. తమ ల్యాబ్‌లోని సీనియర్ శాస్త్రవేత్తలు ఆ హాస్టల్ యజమానులతో మాట్లాడిన తర్వాత సమస్య పరిష్కారమైందని చెప్పారు. అలాగే సిబ్బందిలోని చాలామంది వారి కుటుంబాలను వదిలేసి వచ్చి ఆఫీస్ గెస్ట్‌హౌ్‌సలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని ఎన్‌ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్తా కొనియాడారు.