ప్రధాని ప్రకటనకు ముందుగా సోనియా సందేశం

ABN , First Publish Date - 2020-04-14T13:09:49+05:30 IST

కరోనా వైరస్ వ్యాధి దేశంలో తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. దీంతో కరోనా వైరస్ కట్టడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా....

ప్రధాని ప్రకటనకు ముందుగా సోనియా సందేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాధి దేశంలో తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. దీంతో కరోనా వైరస్ కట్టడికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ రోజు లాక్డౌన్ చివరి రోజు. కేంద్ర ప్రభుత్వం ఇంకా తన నిర్ణయం చెప్పక పోయినా, చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ గడువును  ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇదిలాఉండగా ప్రధాని మోదీ ప్రసంగించడానికి  ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియో సందేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ఈ కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఇళ్లలో సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో శాంతి, సహనం, సంయమనం పాటిస్తున్నందుకు దేశ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక దూరం పాటించండి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో అందరూ సహకరించాలని కోరారు. కాగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుర్తుచేస్తూ సోనియా నిన్న ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని డిమాండ్ చేశారు. జూన్ వరకు ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ఉచిత రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యను సోనియా ప్రశంసించారు. అంతకుముందు సోనియా కేంద్రప్రభుత్వం ఎటువంటి సన్నాహాలు లేకుండా దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తోందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలి  ఆరోపణను అధికార భారతీయ జనతా పార్టీ ఖండించింది. 

Updated Date - 2020-04-14T13:09:49+05:30 IST