లాక్‌డౌన్‌తో భారత్‌కు రూ.5 వేల కోట్లు ఆదా!

ABN , First Publish Date - 2020-07-18T17:43:56+05:30 IST

లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక రంగానికి అంతా నష్టమేనా లాభం లేదా అనే ప్రశ్నకు ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

లాక్‌డౌన్‌తో భారత్‌కు రూ.5 వేల కోట్లు ఆదా!

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక రంగానికి అంతా నష్టమేనా లాభం లేదా అనే ప్రశ్నకు ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. లాక్ డౌన్ కాలంలో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లో కాలుష్యం బాగా తగ్గిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ పరిణామం ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, దాదాపు 630 అకాల మరణాలను నిరోధించి వైద్య ఖర్చుల రూపంలో దాదాపు రూ. 5169 కోట్లు దేశానికి ఆదా చేసిందని వారు లెక్క కట్టారు.


బ్రిటన్‌లోని సర్రెక్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్న ఈ అధ్యయనం వివరాలు సస్టేయినబుల్ సిటీస్ అండ్ సొసైటీస్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా. లాక్ డౌన్ కారణంగా గాల్లోని  పీఎమ్ 2.5 అనే ధూళి కణాల సంఖ్య ఢిల్లీలో 54 శాతం, ముంబైలో 10 శాతం మేర తగ్గిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇతర నగరాల్లో  24 నుంచి 34 శాతం మేర పీఎమ్ 2.5 స్థాయిలో కోత పడిదంన్నారు. మార్చి 25 నుంచి మే 11 వరకూ వివిధ నగరాల్లోని కాలుష్య కారకాల స్థాయిని గత ఐదేళ్లలోని పరిస్థితితో పోల్చిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.


వాయుకాలుష్యం తగ్గడంతో అకాల మరణాల సంఖ్య తగ్గి దేశానికి 690 మిలియన్ డాలర్ల మేర వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని తెలిపారు. ఈ తగ్గుదల ఆశ్చర్యకరమేమీ కాకపోయినప్పటికీ, పర్యావరణంపై మానవుల కారణంగా ఎంతటి ప్రతికూల ప్రభావం పడుతోందో ఈ అధ్యయనం మరోసారి కళ్లకుకట్టినట్టు చూపించిందని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-07-18T17:43:56+05:30 IST