లాక్‌డౌన్‌తో వీళ్లకు భలే అవకాశం.. ఆవేదనలో ప్రజలు!

ABN , First Publish Date - 2020-04-05T14:55:41+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ అవకాశంగా చేసుకుని కొందరు..

లాక్‌డౌన్‌తో వీళ్లకు భలే అవకాశం.. ఆవేదనలో ప్రజలు!

బెంగళూరు/బళ్లారి : కరోనా లాక్‌డౌన్‌ అవకాశంగా చేసుకుని కొందరు వ్యాపారులు ప్రజలకు డేట్‌ఎక్స్‌ఫైరీ అయిన సరుకులు, ఆహారపదార్థాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పాత సరుకు అమ్ముడు పోయిందని కొందరు వ్యాపారులు సంతోషం పడుతుండగా, అది తిన్న ప్రజలు ఆరోగ్య పరంగా అవస్థల పాలవుతున్నారు. కరోనా నేపథ్యంలో యావత్‌ దేశం మార్చి 22 ఆదివారం జనతా కర్ప్యూ పాటించింది. మార్చి 24 మంగళవారం  నుంచి ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. జనం ఇంటి గడప దాటరాదని ఆంక్షలు విధించారు. చాలావరకు సరుకులు రవాణా కావడం లేదు. దీంతో ఉండే సరుకులనే మాల్స్‌, ఇతర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రజల అవసరాలు పెరగడం, అందుకు సరిపడా సరుకులు మార్కెట్‌లో లేకపోవడంతో కొందరు దుకాణదారులు పాత సరుకు (డేట్‌ఎక్స్‌పైరీ)లను అమ్మకాలు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. మామూలుగా కొనుగోలుదారులు వస్తువులపై ఎప్పుడు తయారు చేసింది (మాన్యుఫాక్చరింగ్‌) ఎప్పుటి వరకూ సరుకు అమ్మకాలు చేయవచ్చు అన్న విషయాలు ఫ్రింట్‌ చేస్తారు.


కానీ.. దుకాణాల వద్ద రద్దీ పెరగడంతో ప్రజలు సరుకులు నాణ్యత, కొలత, మ్యానిఫ్యాక్చరింగ్‌ డేట్‌ కూడా చూసి కొనే పరిస్థితుల్లో లేరు. అంతా హడావుడిగా జరిగిపోతోంది. విక్రయాలకు దినంలో కొంత సమయం మాత్రమే కేటాయించడంతో ఎక్కడ దుకాణాలు మూసేస్తారోనని కొనుగోళ్లదారులు కూడా వాటి గురించి పట్టించుకోవడం లేదు. వందకు ఒక్కరో.. ఇద్దరో వాటి గురించి మాట్లాడితే సారీ! మావద్ద ఉండేది ఇదే! కావాలంటే తీసుకో లేకుంటేలేదు! అని వ్యాపారులు ముఖం మీదే చెబుతున్నారు. గత్యంతరంలేక ప్రజలు అవే కొంటున్నారు. నిత్యావసర సరుకులు, పిల్లలు తినే వస్తువులు, సోపులు, నూనే ఇలా చాలా వరకూ నిత్యావసర సరుకులు కాలం చెల్లినవే కొందరు వ్యాపారులు అమ్ముతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కూడా సరుకు రవాణా చేసే లారీల  రావడంలేదు. అంతా లాక్‌డౌన్‌ సమస్య అని చేతులు దులుపుకుంటున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా డేట్‌ అయిపోయిన పచ్చళ్లు, రెడీమేడ్‌ ఫుడ్స్‌ తింటే కలిగే అనారోగ్యాలు కరోనా కంటే ఘోరమైనవనడంలో సందేహం లేదు.

Updated Date - 2020-04-05T14:55:41+05:30 IST