ప్రశ్నోత్తరాలు రద్దు.. జీరో అవర్‌ కుదింపు

ABN , First Publish Date - 2020-09-03T07:46:45+05:30 IST

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈనెల 14న ప్రారంభం కానున్నాయి. వీటి షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసిన ఉభయ సభల సెక్రటేరియట్లు- ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తున్నట్లు, జీరో అవర్‌ను అరగంటకు కుదిస్తున్నట్లు, ప్రైవేటు బిల్లులను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించాయి...

ప్రశ్నోత్తరాలు రద్దు.. జీరో అవర్‌ కుదింపు

  • లిఖితపూర్వక సమాధానాలకు అంగీకారం
  • ప్రైవేటు బిల్లులకు అనుమతి లేదు
  • వర్షాకాల సమావేశాలపై కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈనెల 14న ప్రారంభం కానున్నాయి. వీటి షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసిన ఉభయ సభల సెక్రటేరియట్లు- ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తున్నట్లు, జీరో అవర్‌ను అరగంటకు కుదిస్తున్నట్లు, ప్రైవేటు బిల్లులను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ప్రకటించాయి. ఇలా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు పర్చడం, జీరో అవర్‌ను తగ్గించడం చరిత్రలో ఇదే ప్రథమం. ఈ నిర్ణయాలపై విపక్షాలు భగ్గుమన్నాయి.  ఇది పూర్తిగా ఏకపక్షమని, అన్యాయమని, విపక్షాల గొంతు నొక్కేయడమేనని తీవ్రంగా ఆక్షేపించాయి. కొవిడ్‌ మాటున ప్రభుత్వం - తనకు ఇబ్బందికరమైన ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉద్దేశపూర్వకంగానే రద్దు చేసిందని ఆరోపించాయి. కానీ ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది. సమావేశాలపై అన్ని విపక్షాల సభా నేతలతో సమావేశం నిర్వహించామని, అందులో కుదిరిన అంగీకారం మేరకే దీన్ని రద్దు చేశామని వివరణ ఇచ్చింది. ఒక్క తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రమే ఆ నాడు అభ్యంతరం చెప్పిందని తెలిపింది. అయినా విపక్షాలు ఊరుకోలేదు. చివరకు ప్రభుత్వం పాక్షికంగా దిగివచ్చింది. లిఖితపూర్వక ప్రశ్నలకు (అన్‌స్టార్డ్‌ క్వశ్చన్స్‌) లిఖితపూర్వకంగా బదులిచ్చేందుకు అంగీకరించింది.


రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ - స్వయంగా గులాంనబీ ఆజాద్‌, డెరిక్‌ ఒబ్రెయిన్‌, పినాకి మిశ్రా సహా కొందరు విపక్ష నేతలతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిని వివరించే ప్రయత్నం చేశారు. కాగా, 14వ తేదీన తొలిరోజున మినహాయించి మిగిలిన రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి 1గంట దాకా రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల దాకా లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. మొదటిరోజున మాత్రం ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. అక్టోబరు 1 దాకా జరిగే ఈ సెషన్‌ మొత్తం- సెలవులను తీసేయగా- 18 రోజుల పాటు ఉంటుంది. కొవిడ్‌-రహిత సమావేశాలుగా వీటిని మల్చేందుకు భారీఏర్పాట్లు చేశారు. ఎంపీలందరికీ 72 గంటల ముందే పరీక్ష చేస్తారు. డీఆర్‌డీఓ సిద్ధం చేసిన కిట్లు వారికి అందజేస్తారు. సీటింగ్‌ కూడా పూర్తిగా మార్చేశారు. భౌతిక దూరం పాటించే రీతిలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. మాస్కులు, షీల్డులు, శానిటైజర్లు, టచ్‌-ఫ్రీ తలుపులు ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-09-03T07:46:45+05:30 IST