డిజిటల్‌ దిశగా గ్రంథాలయాలు

ABN , First Publish Date - 2020-03-08T15:00:06+05:30 IST

దశాబ్దాలక్రితం దిన, వార పత్రికలతోపాటు ప్రముఖుల రచనలు, నవలలతో పాఠకులకోసం ఏర్పడిన గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయి. సంఖ్య వేలలో ఉన్నా

డిజిటల్‌ దిశగా గ్రంథాలయాలు

  • రాష్ట్రంలో గ్రంథాలయాలకు కొత్తరూపు
  • నిర్వహణ బాధ్యత ఇకపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలకు
  • నిపుణులచే చర్చాగోష్టులు, విద్యార్థులకు పోటీల ఏర్పాటు

బెంగళూరు(ఆంధ్రజ్యోతి): 

దశాబ్దాలక్రితం దిన, వార పత్రికలతోపాటు ప్రముఖుల రచనలు, నవలలతో పాఠకులకోసం ఏర్పడిన గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరాయి. సంఖ్య వేలలో ఉన్నా సకల సౌకర్యాలు కలిగిన గ్రంథాలయాలు వందలలో కూడా లేవనేది వాస్తవం. ఈ పరిస్థితి మార్పు చేసి కర్ణాటకలో గ్రంథాలయాలకు కొత్త రూపు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,766 గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రంథాలయశాఖకు గ్రాంట్లు సక్రమంగా విడుదల కాకపోవడంతో పర్యవేక్షణ కూడా కష్టతరంగా మారింది. 2019 మార్చి నుంచి గ్రంథాలయాలన్నింటినీ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు మార్పు చేశారు. కానీ సదరుశాఖలో కూడా గ్రాంట్లు సక్రమంగా లేకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ ఎలా   చేయాలనే అంశమై పంచాయతీరాజ్‌తోపాటు నగరాభి వృద్ధిశాఖలు సంయుక్తంగా ఒక కమిటీని రూపొందించాయి. ఈ కమిటీ ఇటీవలే సరికొత్త మార్గదర్శకాలను సూచించింది. ఆ సూచనల మేరకు  నేటి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రంథాలయాలను డిజిటలీకరణ చేయదలిచారు. అందుకు అవసరమైన కంప్యూటర్లను సమకూర్చదలిచారు. పాఠకుల మధ్య చర్చాగోష్టులు ఏర్పాటుచేసి పుస్తకాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించదలిచారు. ఫర్నీచర్‌తోపాటు ఇతరత్రా సౌలభ్యాలు కల్పించి యువతకు అవసరమైన ఉద్యోగ సమాచారం అందుబాటులో ఉంచ బోతున్నారు. నిపుణులచే చర్చాగోష్టులు ఏర్పాటుచేసి విద్యార్థులకు పోటీలు జరిపి బహుమతుల ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించదలిచారు. ప్రతి గ్రంథాలయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయదలిచారు. ఇందులో పాఠశాల హెడ్మాష్టర్‌, గ్రామంలోని యువసంఘాలు, మహిళా సంఘాల నుంచి ఒక్కో ప్రతినిధి,  సాహితీవేత్తలు, గ్రామ కార్యదర్శిలు సభ్యులుగా ఉండాలి. కేవలం పుస్తకపఠనమే కాకుండా యువత ఎక్కువ సమయం గ్రంథాలయాలలో గడుపుతూ డిజిటల్‌ ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకునేలా ఆధునీకరించదలిచారు. కమిటీ నివేదికపై పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జ్‌ ముఖ్య కార్యదర్శి నవీన్‌కుమార్‌ అభిప్రాయం మేరకు గ్రంథాలయాల పర్యవేక్షణ పంచాయతీరాజ్‌ శాఖలకు అప్పగించనున్నారు. యువతకు అనుకూలమైన సిఫారసులు ఉన్నందున మార్పుల ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో సరికొత్త విధానం తీసుకురావడమే ఆశయమన్నారు. 

Updated Date - 2020-03-08T15:00:06+05:30 IST