కశ్మీరులో 4జీ సేవలపై ఎల్‌జీ ఏం చెప్పారో పరిశీలిస్తాం... సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం...

ABN , First Publish Date - 2020-07-28T21:49:27+05:30 IST

జమ్మూ-కశ్మీరులో 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించాలని లెఫ్టినెంట్ గవర్నర్

కశ్మీరులో 4జీ సేవలపై ఎల్‌జీ ఏం చెప్పారో పరిశీలిస్తాం...  సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం...

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము చెప్పినట్లు వస్తున్న మీడియా కథనాలను పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ (ఎఫ్ఎంపీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టుకు ప్రభుత్వం ఈ విధంగా తెలిపింది. 


సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమైన ప్రభుత్వాధికారులపై చర్య తీసుకోవాలని ఎఫ్ఎంపీ ఈ పిటిషన్‌లో కోరింది. 


ఎఫ్ఎంపీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ హుజెఫా అహ్మది మాట్లాడుతూ తనకు కౌంటర్ అఫిడవిట్ ఇటీవలే వచ్చిందని కోర్టుకు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము జమ్మూ-కశ్మీరులో 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయన్నారు. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ కూడా 4జీ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు తెలిపారు. సొలిసిటర్ జనరల్ దీనిని పరిశీలించాలని కోరారు. 


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, లెఫ్టినెంట్ గవర్నర్ ముర్ము ఇచ్చినట్లు చెబుతున్న స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఎఫ్ఎంపీ రిజాయిండర్ తనకు అందినట్లు తెలిపారు. 


అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్లు పేర్కొంటున్న కథనాలను పరిశీలిస్తామన్నారు. 


మీడియా కథనాలను తాము పరిశీలించి, రిజాయిండర్ దాఖలు చేస్తామని జమ్మూ-కశ్మీరు అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. 


Updated Date - 2020-07-28T21:49:27+05:30 IST