కోవిడ్ పాజిటివ్ నిర్థరణ కావడంతో ‘చీకటి దుకాణం’ యజమాని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-25T23:36:26+05:30 IST

తిరునల్వేలిలో ‘చీకటి దుకాణం’ అంటే తెలియనివారు ఉండరు. అక్కడ హల్వా

కోవిడ్ పాజిటివ్ నిర్థరణ కావడంతో ‘చీకటి దుకాణం’ యజమాని ఆత్మహత్య

చెన్నై : తిరునల్వేలిలో ‘చీకటి దుకాణం’ అంటే తెలియనివారు ఉండరు. అక్కడ హల్వా కొని, తినడం కన్నా మించిన సంతోషం లేదని భావించేవారు చాలా మంది ఉన్నారు. ఆ దుకాణం యజమాని హరి సింగ్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని గురువరం ఉదయం తెలిసింది. ఆయన తీవ్ర మనస్తాపంతో తన ప్రాణాలను తానే తీసుకున్నారు. 


తిరునల్వేలి ఎస్‌పీ దీపక్ దామోదర్ మాట్లాడుతూ. హరి సింగ్‌ను మంగళవారం పలయంకొట్టయ్‌లో ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో చేర్పించి, చికిత్స చేయించారని చెప్పారు. ఆయనకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం వచ్చినట్లు తెలిపారు. వైద్య నివేదికలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందన్నారు. 


ఈ వార్త తెలుసుకున్న హరి సింగ్ ఆసుపత్రిలోని ఓ కిటికీకి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. 


హరి సింగ్ పూర్వీకులు ఆర్ కృష్ణ సింగ్ 1900వ సంవత్సరంలో ఈ హల్వా దుకాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు నాణ్యతకే పెద్దపీట వేస్తున్నారని హల్వా ప్రియులు చెప్పారు. ఈ దుకాణంలో వెలుగు తక్కువగా ఉంటుందని, అందువల్ల దీనిని ‘ఇరుత్తు కడాయ్’ అని పిలుస్తారని చెప్పారు. ఇరుత్తు కడాయ్ అంటే చీకటి దుకాణం అని అర్థం అని వివరించారు. 


ఈ దుకాణం యజమానులు మొదటి నుంచి ఆర్భాటాలకు విలువ ఇవ్వలేదని స్థానికులు చెప్పారు. కేవలం తమ పిండి వంటల నాణ్యతపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పండుగల సందర్భంలో కూడా ఇతర స్వీట్ షాపులతో పోటీపడి ఆర్భాటాలు చేయబోరని చెప్పారు. 


సంక్రాంతి, దీపావళి వంటి పండుగల సందర్బాల్లో ఇసుక వేస్తే రాలనంత క్రిక్కిరిసిన జనం ఈ దుకాణంలో ఉంటారన్నారు.


హరి సింగ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-06-25T23:36:26+05:30 IST