హ్యాండ్‌టచ్ లేని వాష్‌బేసిన్
ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST
ప్రాణాంతకమైన కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం, శుభ్రం చేసుకోకుండానే ఆ చేతులతో ముఖాన్ని ముట్టుకోవడం లాంటి పనులను చేయవద్దని...

పుణె, ఏప్రిల్ 6: ప్రాణాంతకమైన కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం, శుభ్రం చేసుకోకుండానే ఆ చేతులతో ముఖాన్ని ముట్టుకోవడం లాంటి పనులను చేయవద్దని డాక్టర్లు, వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో చేతులు కడుక్కోవలసి వచ్చినప్పుడు, పబ్లిక్ టాయ్‌లెట్‌లను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాష్‌బేసిన్‌లను వాడక తప్పదు. అయితే ఒకరు తరవాత మరొకరు ఉపయోగించే ఈ వాష్‌బేసిన్ల కారణంగా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని పుణె జిల్లాలోని తాలేగావ్ ధబేడ్ మున్సిపల్ కార్పొరేషన్ చేతులతో ముట్టుకోకుండానే ఉపయోగించుకునే వాష్‌బేసిన్‌కు అంకురార్పన చేసింది. దీనిని వాడేటప్పుడు చేతితో తాకాల్సిన పని లేదు. దానికి అమర్చిన ప్రత్యేక లీవర్‌ను కాలి పాదంతో ప్రెస్ చేస్తే సబ్బునీరు అరచేతిలో పడుతుంది. చేతులు రుద్దుకున్నాక మరొక లీవర్‌ను పాదంతో ప్రెస్ చేస్తే వాష్‌బేసిన్ ట్యాప్ నుంచి నీరు వస్తుంది.
అదేవిధంగా వారం రోజుల క్రితం ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ధన్‌బాద్ డివిజన్ పరిధిలో ఉన్న భర్వధి వ్యాగన్ కేర్ సెంటర్ కూడా చేతులతో ముట్టుకోకుండానే ఆటోమెటిక్‌గా ఆపరేట్ అయ్యే సోప్ డిస్పెన్సర్, వాటర్ ట్యాప్ ఉన్న వాష్‌బేసిన్‌ను రూపొందించింది.