బరువెక్కిన హృదయంతో వెళ్తున్నా: కంగన

ABN , First Publish Date - 2020-09-14T17:21:15+05:30 IST

వరుస వివాదాలు, అనూహ్య పరిణామాలతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోమవారం ఉదయం ముంబై నుంచి..

బరువెక్కిన హృదయంతో వెళ్తున్నా: కంగన

ముంబై: వరుస వివాదాలు, అనూహ్య పరిణామాలను ఎదుర్కొన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోమవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరారు. బరువెక్కిన హృదయంతో ముంబై విడిచి వెళ్తున్నట్టు ఆమె ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను చేసిన 'పాక్ ఆక్రమిత కశ్మీర్' (పీఓకే) వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. తాను చేసిన పోలిక పూర్తిగా కరెక్ట్ అని పేర్కొన్నారు.


'ఇన్ని రోజులు నన్ను భయభ్రాంతులను చేసిన తీరు, నిరంతర దాడులు, హేళనల కారణంగా బరువెక్కిన హృదయంతో ముంబై వదిలి వెళ్తున్నాను. నా ఇల్లు, నేను పనిచేసే చోటు కూల్చేశారు. నా చుట్టూ మారణాయుధాలతో భద్రత పెట్టుకుని తిరగాల్సి వచ్చింది. పీఓకేతో నేను చేసిన పోలిక పూర్తిగా సరైనదే' అని ఆ ట్వీట్‌లో కంగన పేర్కొంది.


'కాపాడాల్సిన వారే ప్రజాస్వామ్య భక్షకులయ్యారు. నేనేదో బలహీనురాలినని అనుకుని వాళ్లని వాళ్లే ఫూల్స్ చేసుకున్నారు. నన్ను బెదరించడం, అణిచివేయాలని ప్రయత్నించడం ద్వారా వారు తమ సొంత ఇమేజ్‌నే చెడగొట్టుకున్నారు' అని మరో ట్వీట్‌లో ఆమె ఘాటు విమర్శలు చేశారు.


ముంబై నగరాన్ని విడిచిపెట్టేముందు కంగనా రనౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని ఆదివారంనాడు కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. గవర్నర్ తనను ఒక కూతురులా ఆదరించారని, ముంబైలో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పినప్పుడు ఆయన ఎంతో ఓపికగా విన్నారని తెలిపారు. ఒక సాధారణ పౌరురాలిగా మాత్రమే తాను గవర్నర్‌ని  కలిసానని చెప్పారు.

Updated Date - 2020-09-14T17:21:15+05:30 IST