రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

ABN , First Publish Date - 2020-12-27T00:09:16+05:30 IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

హైదరాబాద్: సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ రోజు చేసిన టెస్టుల్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏమీ లేవని వెల్లడించారు. ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రాత్రి రక్తపోటు స్టేటస్ ఆధారంగా రేపు డిశ్చార్జ్‌ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. రజినీకాంత్‌ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రక్తపోటును అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నారు తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం రజినీకాంత్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెల 22న రజినీకాంత్‌ కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది.


తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. అపోలో ఆస్పత్రికి ఫోన్‌ చేసి రజినీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రముఖ నటుడు చిరంజీవి కూడా రజినీకాంత్‌ కుమార్తెకు ఫోన్‌ చేసి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిసింది. రజినీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. కాగా, తన స్నేహితుడు రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని నటుడు కమల్‌హాసన్‌ ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-12-27T00:09:16+05:30 IST