కరోనాతో మరణించే ముందు ఫోన్‌లో ప్రార్థన
ABN , First Publish Date - 2020-03-24T01:23:32+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి అగ్రరాజ్యం అమెరికా కూడా మినహాయింపేమీ కాదు. అమెరికాలో ఇప్పటికి 35వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి అగ్రరాజ్యం అమెరికా కూడా మినహాయింపేమీ కాదు. అమెరికాలో ఇప్పటికి 35వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 500మంది మృతిచెందారు. వీరిలో కనెక్టికట్‌కు చెందిన బిల్ పైక్ అనే 91ఏళ్ల వృద్ధుడు కూడా ఒకరు. ఎవరైనా మరణించే ముందు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం, ఓ పాస్టర్ దైవప్రార్థన చేసి ప్రవచనాలు వినిపిస్తారు. అయితే బిల్.. కరోనా వైరస్ బారిన పడటంతో ఆయన వద్దకు పాస్టర్‌లు రాలేదు. అదే సమయంలో బిల్ కుటుంబం కూడా కరోనా అనుమానంతో క్వారంటైన్‌లో ఉంది. ఈ క్రమంలో బిల్ అంత్యక్రియలు ఎలా చేయాలా? అని ఆలోచిస్తుండగా న్యూ కనాన్‌కు చెందిన పీటర్ వాల్ష్ అనే పాస్టర్ ముందుకొచ్చారు. అయితే ఆయన స్వయంగా వచ్చి ప్రవచనాలు వినిపించలేదు. దీనికోసం టెక్నాలజీని ఉపయోగించి ఫోన్‌లో ప్రవచనాలు చదువుతూ ప్రార్థన చేశారు. ఆ సమయంలో బిల్ పక్కనే నిలబడిన ఓ నర్సు.. బిల్ చెవి దగ్గర ఫోన్ పెట్టి ఆ ప్రవచనాలను ఆయనకు వినిపించింది. ప్రార్థన అనంతరం కుటుంబసభ్యులు ఫోన్ చేసి బిల్‌తో మాట్లాడారు. ఆ తర్వాత 10నిమిషాలకే బిల్ మృతిచెందారు. తన జీవితంలో తొలిసారి ఇలా ఫోన్‌లో ప్రార్థన వినిపించానని పాస్టర్ పీటర్ చెప్పారు. తర భర్తతో చిట్టచివరగా ఫోన్‌లో మాట్లాడటంపై బిల్ భార్య కేథీ మాట్లాడుతూ..‘ఆయనకు మా ప్రేమానుభూతులు చిట్టచివరగా ఇలా అందించగలిగాం. చివరి క్షణాల్లో ఆయన పక్కన మేం లేమన్న భాధను టెక్నాలజీ చాలావరకు దూరం చేసింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.