శబరిమల విమానాశ్రయానికి భూసేకరణ ప్రారంభం
ABN , First Publish Date - 2020-06-18T23:24:40+05:30 IST
శబరిమల విమానాశ్రయం కోసం భూసేకరణకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు
తిరువనంతపురం : శబరిమల విమానాశ్రయం కోసం భూసేకరణకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూమి యాజమాన్యంపై వివాదం న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది.
కేరళ ప్రభుత్వ రెవిన్యూ కార్యదర్శి ఏ జయతిలక్ జారీ చేసిన ఆదేశాల్లో శబరిమల విమానాశ్రయం కోసం 2,263. 13 ఎకరాల భూమిని సేకరించాలని ఆదేశించారు. ఈ బాధ్యతను కొట్టాయం జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ భూమిని భూ సేకరణ, పునరావాసం, పునఃపరిష్కార చట్టం, 2013 ప్రకారం సేకరిస్తారు. ప్రస్తుతం ఈ భూమిపై యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం న్యాయస్థానం విచారణలో ఉన్నందువల్ల నష్టపరిహారం సొమ్మును కోర్టుకు జమ చేస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.