లేడీ అరుణాచలం!

ABN , First Publish Date - 2020-12-17T07:57:39+05:30 IST

రజనీకాంత్‌ ‘అరుణాచలం’ సినిమాలో కథానాయకుడికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. 30రోజుల్లో రూ. 30కోట్లు ఖర్చుపెడితే, రూ.

లేడీ అరుణాచలం!

  • 4నెలల్లోనే 30వేల కోట్లు దానం..
  • బెజోస్‌ మాజీ భార్య దాతృత్వం


న్యూఢిల్లీ, డిసెంబరు 16: రజనీకాంత్‌ ‘అరుణాచలం’ సినిమాలో కథానాయకుడికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. 30రోజుల్లో రూ. 30కోట్లు ఖర్చుపెడితే, రూ. 3వేల కోట్లు అతడి సొంతమవుతాయి. అందులో విజయం సాధిస్తాడు కూడా. అయితే.. తనకు వచ్చిన రూ.3వేల కోట్లను ప్రజలకే దానం చేసేస్తాడు. అపర కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకంజీ స్కాట్‌ కూడా ఇలాంటి మనిషే.


అయితే.. ఇక్కడ ఆమె దానం చేసింది అక్షరాలా రూ.30వేల కోట్లు. అదీ గత 4నెలల్లోనే! ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మహిళల్లో ఆమె అగ్రస్థానంలో ఉన్నారు. అయితే.. సంపదను మరింత పెంచుకునేందుకు కాక, దానధర్మాలకు ఖర్చు పెట్టాలని ఆమె నిర్ణయించుకోవడం విశేషం. కరోనా కారణంగా దెబ్బతిన్న కోట్లాదిమంది జీవితాలను ఆదుకునేందుకు వందలాది స్వచ్ఛంద సంస్థలకు ఆమె తన సం పదను దానం చేస్తున్నారు. వీటి గురించి స్వయంగా మెకంజీయే ప్రకటించారు.


పేదరికాన్ని దూరం చేసేందుకే..

‘‘అమెరికన్ల జీవితాల్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఇదే సమయంలో కోటీశ్వరుల సంపద 80% మేర పెరిగింది. అందుకే ప్రజలకు సాయంగా నిలుస్తున్న 384 స్వచ్ఛంద సంస్థల్ని గుర్తించి, ఆర్థికసాయం అందిస్తున్నా. ఆకలిని, పేదరికాన్ని దూరం చేసేందుకే ఈ ప్రయత్నం’’ అని మెకంజీ పేర్కొన్నారు. విడాకుల సమయంలో బెజోస్‌ ఆమెకు అమెజాన్‌లో 4శాతం వాటాను భరణంగా ఇచ్చారు. ఇంతకూ మెకంజీ ఆస్తి విలువ ఎంతో తెలుసా..? సుమారు 4.1లక్షల కోట్లు!

Updated Date - 2020-12-17T07:57:39+05:30 IST