48 రోజులకు కుదించిన హరిద్వార్ కుంభమేళా

ABN , First Publish Date - 2020-12-27T21:03:23+05:30 IST

వచ్చే ఏడాది జరిగే హరిద్వార్ కుంభమేళాను మూడున్నర నెలలకు బదులుగా ..

48 రోజులకు కుదించిన హరిద్వార్ కుంభమేళా

హరిద్వార్: వచ్చే ఏడాది జరిగే హరిద్వార్ కుంభమేళాను మూడున్నర నెలలకు బదులుగా 48 రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఉత్తారాఖండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ తెలిపారు. కుంభమేళాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జనవరి 1వ తేదీకి బదులు ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేయనున్నట్టు చెప్పారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఘాట్‌లలో మార్చి-ఏప్రిల్‌లో పవిత్ర స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని. ఈ ఘాట్‌లలో 48 రోజుల పాటు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించవచ్చునని చెప్పారు.


ఏళ్ల తరబడి కుంభమేళాను మూడున్నర నెలల పాటు నిర్వహిస్తున్నప్పటికీ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈసారి నెలన్నర రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుంభమేళాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి సన్నాహకాలు చేయలేదని అఖిల భారతీయ అఖారా పరిషత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కుంభమేళాకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిధులను మంజూరు చేశారు.


నిఘా వ్యవస్థ కోసం రూ.17.34 కోట్లకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి తొలి విడతగా రూ.6.94 కోట్లు విడుదల చేశారు. 1000 పడకలతో తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సామగ్రి కొనుగోలుకు రూ.15.46 కోట్లు మంజూరు చేశారు. ఇందులో తొలి విడతగా రూ.6.18 కోట్లు విడుదల చేశారు.

Updated Date - 2020-12-27T21:03:23+05:30 IST