కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి కీలక సూచన
ABN , First Publish Date - 2020-06-23T22:14:29+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంపై...

20 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించండి: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంపై మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కరోనా కట్టడికి తక్షణమే షట్‌డౌన్ విధించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా బెంగళూరులో షట్‌డౌన్ విధించాలని చెప్పారు. లేనిపక్షంలో.. షట్‌డౌన్‌ను విధించి ఆంక్షలను కఠినంగా అమలుచేయని పక్షంలో బెంగళూరు మరో బ్రెజిల్‌గా మారే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ను ప్రకటించిన అనంతరం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని కుమారస్వామి చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంక్షలు విధించడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. బెంగళూరు నగరం మొత్తం కనీసం 20 రోజులు పూర్తి స్థాయి షట్‌డౌన్‌ను విధించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ఆర్థిక వృద్ధి కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఆయన యడ్డీ సర్కార్‌కు హితబోధ చేశారు. కొన్ని ప్రాంతాలను మాత్రమే కరోనా హాట్‌స్పాట్‌లుగా గుర్తించి.. అక్కడ మాత్రమే ఆంక్షలను అమలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని.. మరో 20 రోజులు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించాలని ప్రధానికి ఆయన విన్నవించారు.