దేవెగౌడపై మాజీ సీఎం కుమార స్వామి తీవ్ర అసంతృప్తి!

ABN , First Publish Date - 2020-12-06T15:42:04+05:30 IST

జేడీఎస్ అధినేత దేవెగౌడపై కుమార స్వామికి కాస్తంత అసంతృప్తి ఉందా? కాంగ్రెస్ తో చేతులు కలపడం కుమార స్వామికి ఏమాత్రం

దేవెగౌడపై మాజీ సీఎం కుమార స్వామి తీవ్ర అసంతృప్తి!

బెంగళూరు : జేడీఎస్ అధినేత దేవెగౌడపై కుమార స్వామికి కాస్తంత అసంతృప్తి ఉందా? కాంగ్రెస్‌తో చేతులు కలపడం కుమార స్వామికి ఏమాత్రం రుచించలేదా? రుచించక పోయినా... దేవెగౌడ ఒత్తిడితో కాంగ్రెస్ తో చేతులు కలపారా? అవుననే అంటున్నారు కుమార స్వామి. మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ కుమార స్వామి ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్‌తో చేతులు కలపడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని, అయితే తమ అధినేత దేవెగౌడ ఒత్తిడి వల్లే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టారు. ‘‘మా పార్టీ బీజేపీ బీటీమ్ అని కాంగ్రెస్ బాగా ప్రచారం చేసింది. అసలు కాంగ్రెస్‌తో చేతులు కలపడం నాకు సుతారమూ నచ్చలేదు. అయితే మా పార్టీ అధినేత దేవెగౌడ పట్టుబట్టడం వల్లే కాంగ్రెస్‌తో ప్రయాణించాల్సి వచ్చింది. దేవెగౌడ నిర్ణయంతో ఇప్పుడు పార్టీ బలాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దేవెగౌడ భావోద్వేగాలలో నేను పడిపోయాను. అయితే మా నాన్న తీసుకున్న నిర్ణయానికి నాకేమీ విచారం లేదు. ఆయన సెక్యులర్ సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నారు.’’ అని కుమార స్వామి పేర్కొన్నారు.


ఇన్నాళ్లూ కాంగ్రెస్ తో చేతులు కలిపి, తమ పార్టీకి జనబాహుళ్యంలో ఉన్న మంచి పేరును కోల్పోయామని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పన్నిన కుట్రలో తాను ఇరుక్కున్నానని, అంతలా కుట్ర చేశారని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ కూడా అంతలా ఎన్నడూ ద్రోహం చేయలేదని, కాంగ్రెస్ అంతలా ద్రోహం చేసిందని ఫైర్ అయ్యారు. తాను సీఎంగా ఉంటూ అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి అధికారం బదిలీ చేయలేదన్న విమర్శలున్నా, సీఎంగా ఉన్న సమయంలో ప్రజల దగ్గర మంచి పేరునే సంపాదించుకున్నానని, కానీ, కాంగ్రెస్ తో చేతులు కలిపాక, ఉన్న మంచి పేరు కాస్తా పోయిందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.


కుమార స్వామి అబద్ధాల్లో నిష్ణాతులు : సిద్దరామయ్య ఫైర్

కుమార స్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శిబిరం స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ... కుమార స్వామి అబద్ధాలాడటంలో నిష్ణాతులని ఎద్దేవా చేశారు. రాజకీయాల లాభం కోసం ఎప్పుడూ అబద్ధాలాడుతుంటారని మండిపడ్డారు. కేవలం 37 సీట్లే ఉన్నా... ఆయన్ను సీఎం పదవిలో కూర్చోబెట్టడం తాము చేసిన తప్పిదమా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కన్నీళ్లు పెట్టుకోవడం దేవెగౌడ కుటుంబ సంస్కృతి అని, అందులో కొత్తేమీ లేదని సిద్దరామయ్య ఘాటుగా బదులిచ్చారు. 

Updated Date - 2020-12-06T15:42:04+05:30 IST