ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు చైనా కరోనా టీకా!

ABN , First Publish Date - 2020-12-01T20:11:26+05:30 IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉంగ్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు తెలుస్తోంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు చైనా కరోనా టీకా!

న్యూఢిల్లీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ ఇటీవల కరోనా టీకా వేయించుకున్నట్టు తెలుస్తోంది. చైనా ప్రభుత్వం నుంచి ఆయన కరోనా టీకాను పొందారని అమెరికాకు చెందిన పరిశీలకుడు ఒకరు తెలిపారు. కిమ్ కుటుంబ సభ్యులు, ఉత్తర కొరియాలో మిలటరీ ఉన్నతాధికారులు కూడా ఈ టీకా తీసుకున్నారని తెలిపారు. ఉత్తరకొరియా వ్యవహారాలను నిశితంగా పరిశీలించే హ్యారి కజియానిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్ ఇంటెలిజెన్స్ అధికారులు ద్వారా తనకు ఈ సమాచారం అందిందని తెలిపారు. అయితే.. చైనాకు చెందిన ఏ కంపెనీ ఈ టీకా సప్లై చేసిందనే దానిపై  మాత్రం స్పష్టత లేదు.


చైనాకు చెందిన మూడు సంస్థలు.. సైనోఫార్మ్, సైనోవ్యాక్, క్యాన్‌సీనోబయో కంపెనీలు కరోనా టీకాలను రూపొందించిన విషయం తెలిసిందే. తమ టీకాను పది లక్షల మందికి ఇచ్చామని సైనోఫార్మ్ ఇప్పటికే ప్రకటించింది. మిగతా రెండు సంస్థలు మాత్రం కరోనా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉంది. ఈ దశ పూర్తయ్యాక టీకాను ప్రజలకు అందించేందుకు అవసరమైన ప్రభుత్వానుమతి లభిస్తుంది. మరోవైపు..దేశంలో కరోనా కేసులు ఏవీ నమోదు కాలేదని ఉత్తర కొరియా ఇప్పటివరకూ చెబుతూ వస్తోంది.


అయితే..కరోనా అక్కడ కూడా అడుగుపెట్టే ఉంటుందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాల కారణంగా జనవరి నెలలోనూ ఇరు దేశాల మధ్య రాకపోకలు జరిగిన విషయాన్ని దక్షిణ కొరియా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఇక కరోనా టీకా తయారీ కంపెనీలపై ఉత్తరకొరియా హ్యాకర్లు దాడికి దిగినట్టు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-12-01T20:11:26+05:30 IST