మా పేరు వాడినందుకు 50 కోట్లు చెల్లించండి
ABN , First Publish Date - 2020-05-13T08:27:58+05:30 IST
పలు వ్యాపార సంస్థలు అక్రమంగా తమ బ్రాండ్ పేరును ఉపయోగిస్తూ పీపీఈ కిట్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) తెలిపింది. ‘ఖాదీ ఇండియా’ లోగోను వాడుతున్నాయని...

- పీపీఈ కిట్లపై ‘ఖాదీ ఇండియా’ ట్రేడ్‌మార్క్ లోగో
- మూడు సంస్థలకు నోటీసులు జారీ చేసిన కేవీఐసీ
న్యూఢిల్లీ, మే 12: పలు వ్యాపార సంస్థలు అక్రమంగా తమ బ్రాండ్ పేరును ఉపయోగిస్తూ పీపీఈ కిట్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) తెలిపింది. ‘ఖాదీ ఇండియా’ లోగోను వాడుతున్నాయని వివరించింది. దీంతో ఢిల్లీకి చెందిన నాచియా కార్పొరేషన్స్, పెస్ట్ క్యూర్ ఇన్‌కార్పొరేషన్, వేద్ ప్రకాశ్ మిత్తల్ అండ్ సన్స్ సంస్థలకు నోటీసులు పంపామని చెప్పింది. తమ పేరు, ట్రేడ్‌మార్క్ లోగోను వాడినందుకు రూ.50 కోట్ల చొప్పున చెల్లించాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు కేవీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, ఇప్పటికే ‘ఖాదీ ఇండియా’ లోగోతో ఉత్పత్తి చేసిన పరికరాలను విక్రయించొద్దని పేర్కొంది. ఆ ఉత్పత్తులన్నింటినీ తమకు వెంటనే అప్పజెప్పాలని ఆదేశించింది. వారం రోజుల్లో తమ నోటీసులపై సరైన విధంగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.