కరోనా నివారణకు గొడుగు.. ఆదర్శంగా కేరళలోని గ్రామం!

ABN , First Publish Date - 2020-04-29T00:13:44+05:30 IST

కరోనా నివారణకు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గం అని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం భౌతిక దూరాన్ని పాటించాలని సూచిస్తూ వస్తున్నారు. అయితే కొందరు

కరోనా నివారణకు గొడుగు.. ఆదర్శంగా కేరళలోని గ్రామం!

తిరువనంతపురం: కరోనా నివారణకు మందు లేదని, నివారణ ఒక్కటే మార్గం అని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం భౌతిక దూరాన్ని పాటించాలని సూచిస్తూ వస్తున్నారు. అయితే కొందరు వాటిని పాటిస్తుండగా, మరికొందరు పట్టించుకోవడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతోంది.


ఈ నేపథ్యంలో కేరళలోని తన్నీరుముక్కోమ్ గ్రామ పంచాయతీ దేశానికే ఆరద్శంగా నిలుస్తోంది. ఆ గ్రామంలో కరోనా నివారణకై సరికొత్తగా ఆలోచించి కొత్త విధానాన్ని అమలు పరుస్తున్నారు. అక్కడి ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా గొడుగు వినియోగించాలని ఆ గ్రామ పంచాయతీ తీర్మానించింది. గొడుగు వినియోగం ద్వారా మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం ఉంటుంది. ఈ చర్యను నిపుణులు అభినందిస్తున్నారు. గొడుగు వినియోగం ద్వారా భౌతిక దూరం పాటించినట్లవుతుందని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని చెబుతున్నారు.


కాగా, తన్నీరుముక్కోమ్ గ్రామం పంచాయితీ ప్రజలు గొడుగు వినియోగానికి సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర మంత్రి థామస్ ఇసాక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చర్యను అభినందించారు. ‘భౌతిక దూరాన్ని పాటించడం, ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ గొడుగును తీసుకెళ్లడాన్ని తన్నీరుముక్కోమ్ గ్రామ పంచాయతీ తప్పనిసరి చేసింది. ఇద్దరు వ్యక్తులు తమ తమ గొడుగులను తెరిస్తే.. ఇద్దరి మధ్యా దాదాపు ఒక మీటర్ దూరం ఉంటుంది. తద్వారా ఒకరిని ఒకరు టచ్ చేయకుండా ఉంటారు. ఇది సరైన నిర్ణయం. అంతేకాదు.. గొడుగులను సబ్సిడీ రేట్లకే అందిస్తున్నారు’ అని మంత్రి ఇసాక్ పేర్కొన్నారు.


ఇదిలాఉండగా, కరోనా చైన్ సిస్టమ్‌ను బ్రేక్ చేసేందుకు సదరు గ్రామ పంచాయితీ స్థానిక ప్రజలకు దాదాపు 10వేల గొడుగులను పంపిణీ చేసింది. సబ్సిడీ కింద, లోన్ ద్వారా గొడుగులను పంపిణీ చేయడం విషేశం.

Updated Date - 2020-04-29T00:13:44+05:30 IST