అబ్దుల్ కలాం విగ్రహాన్ని పూలతో అలంకరించిన వ్యక్తి హత్య
ABN , First Publish Date - 2020-12-20T23:58:45+05:30 IST
రోడ్డుపై నివసించే ఓ వ్యక్తి ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని పూలతో అలంకరిస్తున్న వీడియో ఒకటి ఇటీవల

కొచ్చి: రోడ్డుపై నివసించే ఓ వ్యక్తి ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని పూలతో అలంకరిస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొచ్చిలోని మెరైన్ డ్రైవ్‌లో జరిగిందీ ఘటన. విగ్రహాన్ని పూలతో అలంకరించిన ఆ వ్యక్తిని 63 ఏళ్ల శివదాసన్‌గా గుర్తించారు. కలాం అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం. కలాం విగ్రహాన్ని అతడు ప్రతి రోజూ పూలతో అలంకరిస్తుండడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఒక్క రోజు కూడా తప్పకుండా విగ్రహాన్ని అలంకరిస్తూ ఆరాధించేవాడు. కొన్నేళ్ల క్రితం అబ్దుల్ కలాం కేరళ సందర్శించినప్పుడు శివదాసన్‌కు రూ. 500 ఇచ్చారట. ఆ అభిమాన్ని గుండెల్లో దాచుకున్న శివదాసన్.. ఆయనపై ఉన్న గౌరవాన్ని ఇలా తీర్చుకుంటున్నాడు. దానిని తన దినచర్యలో ఓ భాగంగా మార్చుకున్నాడు.
తాజాగా, శివదాసన్ హత్యకు గురికావడం కలకలం రేపింది. మెరైన్ డ్రైవ్‌లో ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అది హత్యేనని తేల్చారు. అతడికి వస్తున్న పేరును సహించలేక అసూయతో తెలిసిన వారే ఆ పనికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 16న అబ్దుల్ కలామ్ మార్గ్ (మెరైన్ డ్రైవ్ వాక్‌వే)లో శివదాసన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ప్రతి రోజూ అక్కడే నిద్రపోయేవాడు. పోస్టుమార్టం రిపోర్టులో అతడిది హత్యేనని తేలింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరవూర్‌కు చెందిన రాజేశ్‌ను అరెస్ట్ చేశారు. శివదాసన్‌ను రాజేశ్ దారుణంగా కొట్టడం వల్ల లోపలికి భాగాలు దెబ్బతిని ఆయన మరణించాడని పోలీసులు వివరించారు.
రాజేశ్ రెండు రోజులుగా శివదాసన్‌పై దాడిచేస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని ఎర్నాకుళం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కె లాల్జీ తెలిపారు. కొల్లాంకు చెందిన శివదాసన్ చాలా ఏళ్లుగా మెరైన్ డ్రైవ్‌లో నివసిస్తున్నాడు. అబ్దుల్ కలాం విగ్రహాన్ని అలంకరిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతడి గురించి అందరికీ తెలిసింది.
ఓసారి అతడు మాట్లాడుతూ.. తాను అబ్దుల్ కలాంను ఒకసారి కొల్లాంలో, మరోసారి తిరువనంతపురంలో కలిసినట్టు చెప్పాడు. తిరువనంతపురం స్టేడియంలో కలాంను కలిసినప్పుడు తన జేబులో రూ. 500 పెట్టి ప్రయాణ ఖర్చుల కింద ఉంచమని చెప్పారని గుర్తు చేసుకున్నాడు. దీనిని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. దీనికి కృతజ్ఞతగానే తానీ పనిచేస్తున్నట్టు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.