పట్టుకున్న పామును పబ్లిక్ కు చూపిస్తూ.. అది కాటేయడంతో..
ABN , First Publish Date - 2020-06-17T03:42:35+05:30 IST
దారి తప్పి ఇళ్లలోకి వచ్చిన పామును పట్టుకుని.. ఊరి చివర విడిచిపెట్టబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కే

కేరళ: దారి తప్పి ఇళ్లలోకి వచ్చిన పామును పట్టుకుని.. ఊరి చివర విడిచిపెట్టబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని నవైకుళం గ్రామపంచాయతీకి చెందిన 30ఏళ్ల సకీర్.. ఆదివారం రోజు ఇళ్ల మధ్యకు వచ్చిన కోబ్రాను పట్టుకున్నాడు. దాన్ని ఊరి బయట విడిచిపెట్టే క్రమంలో.. ప్రజలకు చూపించేందుకు పాముతో విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో సకీర్‌ను పాము పలుమార్ల కుట్టేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ సకీర్.. దానితో విన్యాసాలు చేయడం ఆపలేదు. స్థానికులు కెమెరాలతో రికార్డు చేయడాన్ని చూసి మరింత రెచ్చిపోయాడు. చివరిగా అతను పామును విడిచిపెడుతున్న సమయంలో.. అది సకీర్‌ను కాటేసింది. దీంతో అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే సకీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక నాయకులు.. సకీర్‌ను పాము కుట్టిన వెంటనే ఆసుపత్రికి తరలించలేదని చెబుతున్నారు. పాము కుట్టిన 30నిమిషాలకు సకీర్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. తక్షణం అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే.. బతికేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.