హత్రాస్ వెళ్తున్న కేరళ పాత్రికేయునికి పీఎఫ్ఐతో బంధం : యూపీ పోలీసులు

ABN , First Publish Date - 2020-10-07T20:39:45+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళ్తున్న కేరళ పాత్రికేయునితోపాటు మరికొందరిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు

హత్రాస్ వెళ్తున్న కేరళ పాత్రికేయునికి పీఎఫ్ఐతో బంధం : యూపీ పోలీసులు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళ్తున్న కేరళ పాత్రికేయునితోపాటు మరికొందరిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. వీరికి రాడికల్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. వీరు ఢిల్లీ నుంచి హత్రాస్ వెళ్తుండగా మధుర వద్ద సోమవారం అరెస్టు చేశారు. 


అక్టోబరు 5న అరెస్టయిన నలుగురు వ్యక్తులు  భారీ కుట్రలో భాగంగా శాంతికి భంగం కలిగించేందుకు హత్రాస్ వెళ్తున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. 


కొందరు అనుమానితులు ఢిల్లీ నుంచి హత్రాస్ వెళ్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. మధురలోని మఠ్ టోల్ ప్లాజా వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరంతా ఓ కారులో ప్రయాణిస్తున్నారని, వీరి నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ప్రశాంతతకు భంగం కలిగించే సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


అరెస్టయినవారు తమ పేర్లను వెల్లడించారని, ముజఫర్ నగర్‌కు చెందిన అతిక్ ఉర్ రెహమాన్, బహ్రయిచ్‌కు చెందిన మసూద్ అహ్మద్, మళపురానికి చెందిన సిద్ధిక్, రాంపూర్‌కు చెందిన ఆలం అని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. 


వీరికి రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తోనూ, దాని అనుబంధ సంస్థ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)తోనూ సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 


ఇదిలావుండగా, కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం స్పందిస్తూ, సిద్ధిక్ తమ సంఘానికి కార్యదర్శి అని తెలిపింది. ఉత్తర ప్రదేశ్ పోలీసుల చర్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపింది. 


Read more