కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు : సంచీ తెరిచేందుకు ఎన్ఐఏకు అనుమతి

ABN , First Publish Date - 2020-07-16T00:16:48+05:30 IST

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడు సందీప్ నాయర్ బ్యాగును తెరిచేందుకు

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు : సంచీ తెరిచేందుకు ఎన్ఐఏకు అనుమతి

కొచ్చి : కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడు సందీప్ నాయర్ బ్యాగును తెరిచేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి స్పెషల్ ఎన్ఐఏ కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. సందీప్‌ను బెంగళూరులో కస్టడీలోకి తీసుకున్నపుడు ఆయన వద్దనున్న బ్యాగును ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 


ఈ కేసులోని నిందితులు స్వప్న సురేశ్, సందీప్ నాయర్‌లను ఎన్ఐఏ కార్యాలయంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. నిందితులను ప్రశ్నించేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా ఈ కార్యాలయానికి వచ్చారు. 


నిందితులు రూ.14.82 కోట్లు విలువైన 30 కేజీల బంగారాన్ని డిప్లమేటిక్ బ్యాగేజ్‌గా పేర్కొంటూ స్మగ్లింగ్ చేస్తుండగా తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.


నిందితులు బంగారం స్మగ్లింగ్ నేరానికి పాల్పడటం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంబసీ సీలును, ఎంబ్లమ్‌ను ఫోర్జరీ చేశారని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. నిందితులిద్దరినీ 8 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి స్పెషల్ ఎన్ఐఏ కోర్టు సోమవారం ఆదేశించింది. 


బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు.


Updated Date - 2020-07-16T00:16:48+05:30 IST