కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం అవినీతి కూపం : కాంగ్రెస్ నేత చెన్నితల

ABN , First Publish Date - 2020-07-29T00:37:37+05:30 IST

అవినీతి ఆరోపణల కారు మబ్బుల్లో ఓ ముఖ్యమంత్రి కార్యాలయం చిక్కు

కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం అవినీతి కూపం : కాంగ్రెస్ నేత చెన్నితల

తిరువనంతపురం : అవినీతి ఆరోపణల కారు మబ్బుల్లో ఓ ముఖ్యమంత్రి కార్యాలయం చిక్కుకోవడం మన దేశంలో ఇదే మొదటిసారి అని కేరళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల మరోసారి ఆరోపించారు. కంటోన్మెంట్ హౌస్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంపై అవినీతి మేఘాలు కమ్ముకున్నాయన్నారు. 


శబరిమలలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భూమిని నిర్ణయించేందుకు కన్సల్టెన్సీ సేవల కోసం  అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న లూయిస్ బెర్గర్ కంపెనీకి గత నాలుగేళ్ళలో రూ.4.63 కోట్లు చెల్లించారన్నారు. 32 పేజీల ఫీజిబిలిటీ రిపోర్టు కోసం భారీ మొత్తం ఖర్చు చేశారన్నారు. విమానాశ్రయం కోసం భూమిని ఇప్పటికీ గుర్తించలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీ అగ్రిమెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. 


కొచ్చిలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ముఖ్యమంత్రి పినరయి విజయన్ వద్ద గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన (ప్రస్తుతం పదవీ విరమణ పొందిన) ఎం శివ శంకర్‌ను రెండో రోజు ప్రశ్నించడంపై చెన్నితల స్పందిస్తూ, పినరయి విజయన్ క్రిందనున్న అన్ని పోర్ట్‌ఫోలియోలు అవినీతి కంపు కొడుతున్నాయని మండిపడ్డారు. 


బంగారం అక్రమ రవాణా కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, ఈ సంస్థ పరిథిలోకి చట్టవిరుద్ధంగా జరిగిన నియామకాల ప్రక్రియ రాదని, అందువల్ల ఈ నియామకాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-07-29T00:37:37+05:30 IST