చర్చి బావిలో విగతజీవిగా కేరళ ఫాదర్

ABN , First Publish Date - 2020-06-23T01:44:47+05:30 IST

కేరళలోని కొట్టాయం చర్చిలో ప్రముఖ మత ప్రబోధకుడు ఫాదర్ థామస్ ఎట్టుపారియిళ్ ఇవాళ చర్చిలోని...

చర్చి బావిలో విగతజీవిగా కేరళ ఫాదర్

తిరువనంతపురం: కేరళలోని కొట్టాయం చర్చిలో ప్రముఖ మత ప్రబోధకుడు ఫాదర్ థామస్ ఎట్టుపారయిల్ ఇవాళ ఓ చర్చి బావిలో విగతజీవిగా కనిపించారు. 57 ఏళ్ల ఆయన ఆదివారం నుంచి కనిపించక పోవడంతో సహచరులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పెద్ద ఎత్తున గాలించినప్పటికీ వెంటనే ఆయన జాడ కనిపించలేదు. ‘‘నిన్న ఉదయం కొందరు సహచర ఫాదర్లు సమావేశమయ్యేందుకు వెళ్లినప్పటికీ ఆయన తన గదిలో లేరు. తలుపులు తెరిచిచూసినప్పటికీ అక్కడేం కనిపించలేదు. మొబైల్ ఫోన్ సైతం స్విచ్చాఫ్ చేసి ఉంది. సీసీటీవీలు కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. ఇటీవల బదిలీ కోసం ప్రయత్నిస్తున్న ఆయన ఆదివారం డయోసెసన్ బిషప్‌ను కలవాల్సి ఉంది. డయోసెస్ వర్గాలు ఆరా తీసినప్పటికీ ఆయన సమావేశానికి వచ్చినట్టు సమాచారం లేదు..’’ అని స్థానిక ఫాదర్ ఒకరు పేర్కొన్నారు.  గత సంవత్సరమే అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఫాదర్ థామస్ కొట్టాయం సమీపంలోని పున్నతుర సెయింట్ థామస్ చర్చిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


కాగా సోమవారం ఉదయం గాలింపు విస్తృతం చేసిన పోలీసులు... చర్చి బావిలోనే థామస్ మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. మృతదేహం సమీపంలో ఓ తాడును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామనీ.. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. కాగా ఫాదర్ థామస్ ఎట్టుపారియిళ్‌కు చర్చిలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల చర్చిలో కొన్ని పత్రాలు దహనం కావడం ఆయనను బాగా బాధించినట్టు చెబుతున్నారు. ఈలోగానే ఆయన మరణం చోటుచేసుకోవడంపై స్థానికులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-06-23T01:44:47+05:30 IST