కోవిడ్ సంక్షోభంలో సహకరించిన ప్రతిపక్షాలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-07-15T20:25:21+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సహకరించిన ప్రతిపక్షాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి,

కోవిడ్ సంక్షోభంలో సహకరించిన ప్రతిపక్షాలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సహకరించిన ప్రతిపక్షాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు చెప్పారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కోవిడ్-19పై ఒంటరిగా పోరాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించి ఉంటే, విఫలమై ఉండేవారమని చెప్పారు. అందుకే తాము ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, మతపరమైన సంస్థల సహకారం తీసుకున్నామన్నారు. 


ఈ మహమ్మారిపై పోరాటంలో మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీలను కూడా తాము కోరామని చెప్పారు. మద్దతిచ్చిన బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 


పరిస్థితులు తప్పుడు దిశలో వెళ్తున్నపుడు, లోపాలను ప్రజలు ఎత్తి చూపినపుడు తాము దిగాలుపడిపోలేదని, పొరపాట్లను సరిదిద్దడానికి ప్రయత్నించామని చెప్పారు. ప్రతి తప్పును తాము గమనంలోకి తీసుకున్నామన్నారు. 


ఈ మహమ్మారిని ఎదుర్కొనడంలో ‘ఢిల్లీ మోడల్’ గురించి మాట్లాడుతూ, ప్రజలను సమష్టిగా ఏకతాటిపైకి తేవడమే ఢిల్లీ మోడల్ మూల సిద్ధాంతమని తెలిపారు. సమష్టిగా ఉండటమే ఈ మోడల్ ప్రధాన సూత్రమని చెప్పారు. హోం ఐసొలేషన్ మరొక ముఖ్యమైన విషయమని, తాము దీనిని సదుపాయంగా ఉండేలా చేశామని వివరించారు. 


పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఏర్పడినపుడు తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని, కేంద్ర ప్రభుత్వం తమకు సహాయపడిందని చెప్పారు. యాంటిజెన్ టెస్టింగ్ ఢిల్లీలోనే మొదట ప్రారంభమైందని, కేంద్ర ప్రభుత్వం తమకు యాంటిజెన్ టెస్టింగ్ కిట్స్ అందజేసిందని తెలిపారు. దీంతో రోజుకు 20 వేల చొప్పున పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 


Updated Date - 2020-07-15T20:25:21+05:30 IST