వ్యవసాయ చట్టాల కాపీలను చించేసిన కేజ్రీవాల్
ABN , First Publish Date - 2020-12-17T22:58:54+05:30 IST
రైతుల నిరసనకు ఆప్ మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. రైతుల నిరసన చేస్తున్న ప్రదేశాల్లో తాగు నీరు, మెడికల్ కేర్, సానిటేషన్ వంటి సేవా కార్యక్రమాలు చేస్తోంది. గతవారం ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతులను

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యవసాయ చట్టాల ఢిల్లీ అసెంబ్లీలో చించేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. గురువారం సమావేశంలో భాగంగా ఈ చట్టాలపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవకండి’’ అంటూ మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను చించేశారు. ఆ సమయంలో సభలోని సభ్యులు బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు సంఘీభావం పలికారు.
‘‘అసెంబ్లీ సాక్షిగా ఈ మూడు వ్యవసాయ చట్టాలను చించేస్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఒక విజ్ణప్తి చేస్తున్నాను. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి. బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవొద్దు. కరోనా లాక్‌డౌన్‌లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపజేసేంత అవసరం ఏమొచ్చింది?’’ అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు.
‘‘రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ చట్టాల గురించి వివరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భూములు తీసుకోవడం లేదు కదా, ఈ చట్టాల వల్ల రైతులు లాభపడతారని యూపీ సీఎం అంటున్నారు. ఇది నిజంగా ప్రయోజనం చేకూర్చేది అయితే రైతులు ఎందుకు నిరసన చేస్తున్నారు? కొంత మంది బీజేపీ నేతలు రైతులను దేశద్రోహులు అంటున్నారు. చాలా మంది మాజీ ఆర్మీ ఉద్యోగులు, గాయకులు, సెలబ్రిటీలు, డాక్లర్లు, ట్రైడర్లు వారికి మద్దతు ఇస్తున్నారు. వీళ్లు కూడా దేశద్రోహులేనా? జాగ్రత్త.. ప్రతి రైతు ఒక భగత్‌సింగ్‌లా తయారవుతున్నారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
రైతుల నిరసనకు ఆప్ మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. రైతుల నిరసన చేస్తున్న ప్రదేశాల్లో తాగు నీరు, మెడికల్ కేర్, సానిటేషన్ వంటి సేవా కార్యక్రమాలు చేస్తోంది. గతవారం ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతులను కలిసిన కేజ్రీవాల్.. ‘‘రైతుల అన్ని డిమాండ్లకు మేము మద్దతు ఇస్తున్నాం’’ అని ప్రకటించారు.