రైతు బిల్లులను వ్యతిరేకించండి: కేజ్రీవాల్ పిలుపు

ABN , First Publish Date - 2020-09-18T20:03:55+05:30 IST

వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను..

రైతు బిల్లులను వ్యతిరేకించండి: కేజ్రీవాల్ పిలుపు

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకించాలని బీజేయేతర పార్టీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడు పిలుపునిచ్చారు.


'కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులతో పెద్ద కంపెనీల చేతిల్లో రైతులు మోసపోతారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఈ బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలి. ఎంపీలంతా సభకు హాజరుకావాలి. నాటకీయ పద్ధతిలో వాకౌట్లు చేయవద్దు. దేశంలోని రైతులంతా మిమ్మల్ని (ఎంపీలను) గమనిస్తున్నారు' అని కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమ్ ఆద్మీ  పార్టీ (ఆప్) వ్యతిరేకిస్తోందని కేజ్రీవాల్ గురువారంనాడే ప్రకటించారు. ఇవి రైతు వ్యతిరేక బిల్లులనీ, దేశవ్యాప్తంగా రైతులు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నారనీ చెప్పరు. ఈ మూడు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, తమ పార్టీ మాత్రం ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని చెప్పారు.

Updated Date - 2020-09-18T20:03:55+05:30 IST