ప్రపంచం దృష్టికి ‘ఉగ్రవాద కేంద్రం’ దుశ్చర్యలు : విదేశాంగ మంత్రి జై శంకర్

ABN , First Publish Date - 2020-11-26T19:44:27+05:30 IST

క్రాస్ బోర్డర్ టెర్రరిజంలో పాకిస్థాన్ పాత్రపై ప్రపంచం దృష్టి సారించేలా

ప్రపంచం దృష్టికి ‘ఉగ్రవాద కేంద్రం’ దుశ్చర్యలు : విదేశాంగ మంత్రి జై శంకర్

న్యూఢిల్లీ : క్రాస్ బోర్డర్ టెర్రరిజంలో పాకిస్థాన్ పాత్రపై ప్రపంచం దృష్టి సారించేలా భారత దేశం కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ చెప్పారు. ముంబై ఉగ్రవాద దాడులు జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై శంకర్ ట్విటర్ వేదికగా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆయన బహ్రెయిన్, సీషెల్స్, యూఏఈ దేశాల్లో పర్యటిస్తున్నారు. 


2008 నవంబరు 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో 10 మంది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ ట్రైన్ స్టేషన్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. 9 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అజ్మల్ అమిర్ కసబ్ అనే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. కసబ్‌కు ఉరి శిక్ష విధించడంతో పుణేలోని యెరవాడ కేంద్ర కారాగారంలో 2012 నవంబరు 11న ఉరి తీశారు. 


ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ బ్యూరో ఓ ట్వీట్‌లో  స్పందిస్తూ, ముంబైలో జరిగిన నరమేధానికి కారకులను చట్టపరంగా శిక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. ఆరుగురు అమెరికన్లతోపాటు బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపింది. 


భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న క్రాస్ బోర్డర్ ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించేలా చేస్తామని జై శంకర్ ట్వీట్ చేశారు. ‘‘భారత దేశానికి వ్యతిరేకంగా పీడగా మారిన క్రాస్ బోర్డర్ టెర్రరిజంపైనా, అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంపైనా ప్రపంచం దృష్టి పడేలా చేస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే ఆయన పాకిస్థాన్ పేరును ప్రస్తావించ లేదు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత దేశ అధికారులు, నేతలు మాట్లాడేటపుడు ఉగ్రవాద కేంద్రం అని పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-11-26T19:44:27+05:30 IST