కఠువా కేసు నిందితుడిపై జువెనైల్ విచారణ ఆపండి: సుప్రీం
ABN , First Publish Date - 2020-02-08T08:49:43+05:30 IST
జమ్మూ కశ్మీరులోని కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు ...

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జమ్మూ కశ్మీరులోని కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మైనర్‌గా భావిస్తున్న నిందితుడిపై జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లో విచారణ నిలిపివేయాలంటూ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ స్టే ఇచ్చింది. 2018లో నేరం జరిగిన సమయానికి నిందితుడు మైనర్ అంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జమ్మూ కశ్మీరు హైకోర్టు పొరపాటుగా ధ్రువీకరించిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. మునిసిపల్, పాఠశాల రికార్డుల్లో నమోదైన నిందితుడి జనన తేదీలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని హైకోర్టు గుర్తించలేదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది పీఎస్ పట్వాలియా పేర్కొన్నారు. అతన్ని జువనైల్‌గానే పరిగణిస్తూ జేజేబీ విచారణ కొనసాగించడాన్ని తప్పుపట్టారు. ఈ వాదనను విన్న జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం... జేజేబీలో విచారణపై స్టే ఇచ్చింది.