కోవిడ్-19 ట్రాకర్‌ను అభివృద్ధిపరచిన కశ్మీరు విద్యార్థి

ABN , First Publish Date - 2020-05-30T20:24:52+05:30 IST

జమ్మూ-కశ్మీరు ప్రజలు కోవిడ్-19 వివరాలను తెలుసుకునేందుకు అవకాశం

కోవిడ్-19 ట్రాకర్‌ను అభివృద్ధిపరచిన కశ్మీరు విద్యార్థి

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు ప్రజలు కోవిడ్-19 వివరాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించే వెబ్ పేజీని శ్రీనగర్ విద్యార్థి హైదర్ అలీ పంజాబీ అభివృద్ధిపరచారు. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ, ఆ అసౌకర్యాన్ని అధిగమిస్తూ ఈ కోవిడ్-19 ట్రాకింగ్ వెబ్ పేజీని ఉపయోగించుకోవచ్చు. 


కోవిడ్‌కశ్మీర్ డాట్ ఓఆర్‌జీ పేరుతో ఈ వెబ్ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిని కోవిడ్ఇండియా డాట్ ఓఆర్‌జీ తరహాలో రూపొందించారు. కోవిడ్ఇండియా డాట్ ఓఆర్‌జీని యావత్తు భారత దేశం కోసం తయారు చేశారు. 


కోవిడ్‌కశ్మీర్ డాట్ ఓఆర్‌జీని జమ్మూ-కశ్మీరులో కోవిడ్ -19 వ్యాధికి సంబంధించిన సమాచారం, కశ్మీరు లోయలో ఈ వ్యాధి వ్యాప్తి వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. 


ఎంసీఏ విద్యార్థి హైదర్ అలీ పంజాబీ మాట్లాడుతూ ఆలోచన వచ్చిన మరుక్షణంలోనే తాము ఈ ప్రాజెక్టు కోసం పని ప్రారంభించామన్నారు. ప్రజలకు పరిపూర్ణ సమాచారాన్ని అందజేయగలిగే వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నట్లు తెలిపారు. జిల్లాలవారీగా కోవిడ్-19 కేసులు, మ్యాపులు, ఈ వ్యాధికి సంబంధించి రోజువారీ వెల్లడయ్యే సమాచారం ప్రధానంగా ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చునని తెలిపారు. 


వైద్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-05-30T20:24:52+05:30 IST