ప్రపంచంలో విశిష్టమైనది కశ్మీరీ కుంకుమ పువ్వు : మోదీ

ABN , First Publish Date - 2020-12-27T19:33:14+05:30 IST

ప్రపంచంలో కశ్మీరీ కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉందని

ప్రపంచంలో విశిష్టమైనది కశ్మీరీ కుంకుమ పువ్వు : మోదీ

న్యూఢిల్లీ : ప్రపంచంలో కశ్మీరీ కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇతర దేశాల్లో లభించే కుంకుమ పువ్వుకు కశ్మీరులో ఉత్పత్తయ్యే కుంకుమ పువ్వుకు నాణ్యత విషయంలో చాలా తేడా ఉందన్నారు. 


ప్రతి నెలా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడుతూ, నాణ్యత గురించి మాట్లాడితే, కశ్మీరీ కుంకుమ పువ్వు చాలా విశిష్టమైనదన్నారు. ఇది ఇతర దేశాల్లో దొరికే కుంకుమ పువ్వుకు పూర్తిగా భిన్నమైనదని తెలిపారు. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ఈ ఏడాది వచ్చిందని, ఆ తర్వాత దీనికి అంతర్జాతీయ మార్కెట్లో న్యాయమైన స్థానం లభించిందని చెప్పారు. 


ఏదైనా ఉత్పత్తికి మూలాలు నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందినవైనపుడు, ఆ మూల ప్రదేశం కారణంగా ఆ ఉత్పత్తికి నాణ్యత, ప్రతిష్ఠ  వచ్చినపుడు జీఐ ట్యాగ్‌ను ఇస్తారు. ఈ ఏడాది జూలైలో కశ్మీరీ కుంకుమ పువ్వుకు జీఐ ట్యాగ్ లభించింది. దీంతో కశ్మీరులో ఉత్పత్తి అయిన కుంకుమ పువ్వును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో జమ్మూ-కశ్మీరు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కే చౌదరి కశ్మీరీ కుంకుమ పువ్వును యూఏఈ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో ప్రవేశపెట్టారు. ఈ విజయాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆత్మనిర్బర్ భారత్ పథకంలో భాగంగా కశ్మీరీ కుంకుమ పువ్వును కొనాలని ప్రజలను కోరారు. జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్, 1999 ప్రకారం మన దేశంలో జీఐ ట్యాగ్స్‌ను జారీ చేస్తారు. 


Updated Date - 2020-12-27T19:33:14+05:30 IST