‘చిలైకల్లన్’ ప్రభావంతో వణకిపోతోన్న కాశ్మీర్

ABN , First Publish Date - 2020-12-26T21:41:39+05:30 IST

హిమ నగరం జమ్మూకాశ్మీర్ చలికి వణికిపోతోంది. ఎప్పుడూ మంచులోనే బతికే అక్కడి ప్రజలు కూడా కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. రోజురోజుకు చలి పెరిగిపోతుండడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కశ్మీర్‌లో 15 రోజులుగా, జమ్ములో...

‘చిలైకల్లన్’ ప్రభావంతో వణకిపోతోన్న కాశ్మీర్

శ్రీనగర్: హిమ నగరం జమ్మూకాశ్మీర్ చలికి వణికిపోతోంది. ఎప్పుడూ మంచులోనే బతికే అక్కడి ప్రజలు కూడా కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. రోజురోజుకు చలి పెరిగిపోతుండడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కశ్మీర్‌లో 15 రోజులుగా, జమ్ములో వారం రోజులుగా ఇదే పరిస్థితి. శనివారం కూడా అక్కడి కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానాని(ఫ్రీజింగ్ పాయింట్‌)కి దిగువనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కశ్మీర్‌లో సాధారణ వర్షపాతం కురుస్తుందని, దాంతో పాటు మంచు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లో ఇంత చలి ఉండడానికి అతిశీతల పరిస్థితి 'చిల్లై కలన్' కొనసాగుతుండటమే కారణమని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. 


డిసెంబర్ 21న ప్రారంభమైన ఈ చిల్లై కలన్ జనవరి 31 వరకు 40 రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత 20 రోజులపాటు 'చిల్లై కుర్ద్' (తక్కువ చలి), ఆ తర్వాత 10 రోజులపాటు 'చిల్లై బచ్చ' (పిల్ల చలి) పరిస్థితులు కొనసాగుతాయన్నారు. వీటివల్లే ఈ స్థాయిలో కాశ్మీర్ వణికిపోతోందని వివరించారు. ఈ నెల 12న మంచు కురిసినప్పటి నుంచి కశ్మీర్‌లో వాతావరణం పొడిగా, చల్లగానే ఉంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు ఫ్రీజింగ్ పాయింట్‌కు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. ఇక జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్‌ 3.7 డిగ్రీలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శుక్రవారం నమోదైన మైనస్ 4.3 డిగ్రీలతో పోల్చితే శనివారం కొంత చలి ప్రభావం తగ్గిందన్నారు. ఇక దక్షిణ కశ్మీర్లోని పర్యాటక ప్రదేశం పహల్గామ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 4.5 డిగ్రీలుగా ఉన్నదని, గత రాత్రి నమోదైన మైనస్ 5.9 డిగ్రీల కంటే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైందని చెప్పారు.


కాశ్మీర్‌లో మిగతా ప్రాంతాలన్నీ ఒక ఎత్తయితే ఉత్తర కశ్మీర్లోని ఫేమస్ గుల్మార్గ్‌ స్కై రిసార్ట్‌లో చలి అత్యంత భారీగా పడిపోయింది. కశ్మీర్ వ్యాలీలోనే అత్యంత తక్కువగా మైనస్ 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాశ్మీర్‌లో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో పడిపోయాయి. ఖాజీగండ్‌లో మైనస్ 4 డిగ్రీలు, కుప్వారాలో మైనస్ 3.6 డిగ్రీలు, కొకెర్‌నాగ్‌లో మైనస్ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-12-26T21:41:39+05:30 IST