కోవిడ్‌నుబట్టి కర్తార్‌పూర్ కారిడార్ పునఃప్రారంభంపై నిర్ణయం : భారత్

ABN , First Publish Date - 2020-10-04T02:20:00+05:30 IST

పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు వెళ్ళేందుకు నిర్మించిన రహదారి కర్తార్‌పూర్ కారిడార్‌ పునఃప్రారంభంపై త్వరలో నిర్ణయం

కోవిడ్‌నుబట్టి కర్తార్‌పూర్ కారిడార్ పునఃప్రారంభంపై నిర్ణయం : భారత్

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు వెళ్ళేందుకు నిర్మించిన రహదారి కర్తార్‌పూర్ కారిడార్‌ పునఃప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాకిస్థాన్ ఈ రహదారిని పునఃప్రారంభించింది. 


భారత దేశంలోని డేరా బాబా నానక్ సాహిబ్, పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ మధ్య కర్తార్‌పూర్ కారిడార్ ఉంది. ఇది 4.7 కిలోమీటర్ల పొడవైన మార్గం. దీనిని కోవిడ్-19 మహమ్మారి కారణంగా మూసివేశారు. కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని తిరిగి తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం శనివారం తెలిపింది. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, సంబంధిత అధికారులతో తాము సంప్రదిస్తున్నామని తెలిపింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహా సంబంధిత శాఖలతో సంప్రదిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ ప్రోటోకాల్, ఆంక్షల సడలింపు పరిస్థితులనుబట్టి ఈ కారిడార్‌ను పునఃప్రారంభించడం, ఆంక్షలను సడలించడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. 


పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌ను పునఃప్రారంభించినట్లు తెలిపింది. భారత దేశం నుంచి వచ్చే భక్తులు ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మార్గంలో ప్రయాణించవచ్చునని తెలిపింది. 


Updated Date - 2020-10-04T02:20:00+05:30 IST