నిబంధనలు పాటిస్తునే.. న్యూ ఇయర్ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-14T01:14:32+05:30 IST
నూతన సంవత్సర వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది.

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. పబ్బులు, బార్‌లలో, ఇళ్లల్లో పరిమిత సంఖ్యలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చని తెలిపింది. బార్లు, పబ్బులు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేయాలని చెప్పింది. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. రెవెన్యూ మంత్రి ఆర్ అశోక మాట్లాడుతూ.. కోవిడ్ నియమాలు పాటించని బార్లు, పబ్బులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నగరంలో ప్రముఖ ప్రాంతాలైన ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డులలో వేడుకలను నిషేధించినట్లు తెలిపారు.
బహిరంగ సభలు నిర్వహించొద్దని, ఈ నియమాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 20 నుంచి జనవరి 2 మధ్య బహిరంగ సభలపై ఆంక్షలు అమలవుతాయిని చెప్పారు. నూతన సంవత్సర సంబురాలు, ఇతర బహిరంగ వేడుకలకు పోలీసు అనుమతి తప్పనిసరని తెలిపారు. వేడుకల అనుమతికి కావాల్సిన పాసుల కోసం పోలీసు శాఖ వారిని సంప్రందించాలని సూచించారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే వేడుకలు చేసుకోవాలని ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ అన్నారు. జనసామార్థ్యం ఎక్కువ అయితే కోవిడ్ ప్రబలే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు.