సార్క్ దేశాలతో సరే...సీఎంలతో సమావేశం ఎప్పుడు?: సిబల్

ABN , First Publish Date - 2020-03-16T21:02:07+05:30 IST

సార్క్ దేశాలతో ప్రధాని సమావేశం నిర్వహించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్వాగతించారు. ఇదే సమయంలో దేశంలో కరోనా ..

సార్క్ దేశాలతో సరే...సీఎంలతో సమావేశం ఎప్పుడు?: సిబల్

న్యూఢిల్లీ: సార్క్ దేశాలతో ప్రధాని సమావేశం నిర్వహించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్వాగతించారు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులతో కూడా ప్రధాని తక్షణ సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.


సోమవారంనాడిక్కడ మీడియాతో సిబల్ మాట్లాడుతూ, సార్క్ దేశాలతో ప్రధాని సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఇది మంచి చర్యేనని అన్నారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులపై చర్చించేందుకు, తక్షణ చర్యల విషయంపై ఏకాభిప్రాయానికి రావడానికి వీలుగా ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులతో కూడా ఆయన వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు.


సెన్సెక్స్ పడిపోవడంపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ తప్పుపట్టారు. 'అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కరోనా వైరస్. కాస్త అటూఇటూగా ప్రపంచం దేశాల్లో కార్యక్రమాలన్నీ మూతపడుతున్నాయి. కరోనా వైరస్ పుట్టిన వుహాన్ ప్రపంచ దేశాలకు అనేక నిత్యావసరాలను సరఫరా చేస్తోంది. ఇది గ్లోబల్ ట్రేడ్‌ మందగమనానికి కారణమవుతూ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది' అని సిబల్ అన్నారు. గ్లోబల్ ఎకానమీతో మనం కూడా ముడిపడి ఉన్నందున ఆ ప్రభావం మనపైనా ఉంటుందన్నారు.


'ఎస్‌బీఐ చైర్మన్‌ను మందలించడం మినహా ఆర్థిక మంత్రికి ఏమీ తెలియదు. పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో ఆమెకు నిజంగానే తెలియదు' అని సిబల్ వ్యాఖ్యానించారు. వాస్తవ అంశాలపై బీజేపీ దృష్టి సారించడం లేదని కూడా తప్పుపట్టారు. ఓవైపు ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే బీజేపీ మాత్రం ట్రంప్ పర్యటనతో బిజీగా గడిపిందని, ఈ ఎజెండా ఇలాగే కొనసాగుతూ పోతుంటే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ ఇప్పటికైనా వాస్తవ అంశాలపై దృష్టి సారించాలని సిబల్ హితవు పలికారు.

Updated Date - 2020-03-16T21:02:07+05:30 IST