తమిళ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ఇదేగానీ జరిగితే..

ABN , First Publish Date - 2020-12-07T18:32:07+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించక ముందే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ అప్పుడే...

తమిళ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. ఇదేగానీ జరిగితే..

రజినీతో పొత్తుకు కమల్ ప్రయత్నాలు

చెన్నై (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించక ముందే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ అప్పుడే పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం రజనీ వర్గంతో మక్కల్‌ నీదిమయ్యం సీనియర్‌ నేతలు రహస్య మంతనాలు సాగిస్తున్నారు. వచ్చే యేడాది జనవరిలో పార్టీ ప్రారంభి స్తానంటూ  రజనీకాంత్‌ చేసిన ప్రకటన అన్నాడీఎంకే, డీఎంకే వంటి ప్రధాన పార్టీలకు గుబులు పుట్టించింది. అయితే రజనీ ప్రకటన మక్కల్‌ మండ్రం నేతలు, కోట్లాదిమంది అభిమానులలో కలిగించిన సంతోషం కంటే అత్యధికంగా సంతోషపడింది మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు, ఆయన చిరకాల సినీరంగ మిత్రుడు, ఉలగ నాయగన్‌ కమల్‌హాసన్‌ అంటే అతిశయోక్తికాదు. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలించక, అన్నాడీఎంకే కూటమి, డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలో  తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడిన కమల్‌హాసన్‌కు రజనీకాంత్‌ చేసిన ఆకస్మిక ప్రకటన చెప్పలేనంత సంతోషాన్ని తెచ్చిపెట్టింది.


రజనీ పార్టీ ప్రారంభించినా, ప్రారంభించకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మద్దతు తప్పకుండా కోరతానని ఇటీవల కమల్‌హాసన్‌ పలు సభల్లో చెబుతూ వచ్చారు. తాజాగా మాజీ ఐఏఎస్‌ అధికారి సంతోష్‌బాబు మక్కల్‌ నీదిమయ్యంలో చేరినప్పుడు కూడా కమల్‌హాసన్‌ అదే మాటను నొక్కి చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ రజనీ గత సోమవారం మక్కల్‌ మండ్రం నేతలతో సమావేశమైన తర్వాత పార్టీ ప్రారంభించే విషయమై ప్రకటన చేస్తారని రజనీ అభిమానులతోపాటు కమల్‌హాసన్‌ కూడా ఆశగా ఎదురు చూశారు. ఎట్టకేలకు రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని, జనవరిలో పార్టీని పెడుతున్నారని తెలియటంతో కమల్‌ హాసన్‌తోపాటు మక్కల్‌ నీదిమయ్యం నేతలంతా పండగ చేసుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ కమల్‌ చేతుల కలిపితే ఘనవిజయం ఖాయమైపోయిం దన్న ధీమాతో మక్కల్‌ నీదిమయ్యం నాయకులు ఉన్నారు.


సీఎం అభ్యర్థి ఎవరు?

రజనీ పార్టీతో పొత్తు కుదుర్చుకు నేందుకు మక్కల్‌ నీదిమయ్యం నేతలు మంతనాలు జరుపుతు న్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా రెండు పార్టీలలో ఎవరన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రజనీ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే ప్రసక్తేలేదని గత ఫిబ్ర వరిలోనే ప్రకటించారు. అయితే పార్టీ తరఫున విద్యావం తుడైన వ్యక్తిని లేదా మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులలో ఒకరిని ఎంపిక చేస్తానని కూడా తెలిపారు. కనుక రజనీ పార్టీ పెడితే సీఎం అభ్యర్థిగా ఒకరిని ఆ పార్టీ ప్రకటించ డం ఖాయం. అయితే మక్కల్‌ నీదిమయ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడైన కమల్‌హాసన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు రంగం సిద్ధమైంది. సీఎం అభ్యర్థి విషయంలోనూ రెండు పార్టీల మధ్య పొంతన కుదరదని తెలుస్తోంది.


కమల్‌ అంగీకరిస్తారా?

రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయాలను స్థాపిస్తానని రజనీ చేసిన ప్రకటన మక్కల్‌ నీదిమయ్యం నేత కమల్‌ హాసన్‌కు ప్రస్తుతం మింగుడు పడటం లేదు. తొలి నుంచీ తాను నాస్తికవాది అని ప్రకటించుకున్న కమల్‌ ఆధ్యాత్మిక రాజకీయం వైపు దృష్టిసారిస్తున్న రజనీతో పొత్తుపెట్టుకు నేందుకు సాహసిస్తారా? అని మక్కల్‌ నీదిమయ్యం నేతలు కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కమల్‌ అంతగా పట్టించుకోరని, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను ఓడించాలన్నదే ఇరువురి ప్రధాన ఆశయం గనుక రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడం ఖాయమని మక్కల్‌ నీదిమయ్యంలోని మరో వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. 


గతంలో కమల్‌కు సంబంధించిన సినిమా ఫంక్షన్‌లో రజనీ మాట్లాడుతూ అవసరమయితే భవిష్యత్‌ అంగీకరిస్తే రాజకీయాల్లో కమల్‌హాసన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. సినీరంగంలో ఇద్దరూ పోటీపడినా వారిలో ఈర్ష్య, ద్వేషాలు లేకుండా ప్రాణమిత్రులుగానే ఉంటున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ నెలఖారులోగా తన మిత్రుడిని కమల్‌హాసన్‌ స్వయంగా కలుసుకుని పొత్తు ఏర్పాటుపై చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని కూడా ఆ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కమల్‌, రజనీ కలిసి నటించిన సినిమాలు విజయవంతమైనట్లే ఇరువురూ రాజకీయ రంగంలోనూ విజేతలవుతారని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-07T18:32:07+05:30 IST