కమల్‌ దాగుడుమూతలు!

ABN , First Publish Date - 2020-09-21T13:55:36+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ సిద్ధమవుతుంటే ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ నేతృత్వం వహిస్తున్న మక్కల్‌ నీదిమయ్యంలో అలాంటి సందడి కనిపించడం

కమల్‌ దాగుడుమూతలు!

చెన్నై (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ సిద్ధమవుతుంటే ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ నేతృత్వం వహిస్తున్న మక్కల్‌ నీదిమయ్యంలో అలాంటి సందడి కనిపించడం లేదు. అసలు కమల్‌హాసన్‌ ఎక్కడున్నారనే ప్రశ్న ఆ పార్టీకి చెందిన వేలాదిమంది కార్యకర్తల మదిలో మెదలుతోంది. ఐదు నెలల కరోనా లాక్‌డౌన్‌ కాలంలో కమల్‌హాసన్‌ ఒకటి రెండు సార్లు మాత్రమే జనం ఎదుట ప్రత్యక్షమయ్యారు. అంతే వేగంతో అదృశ్యమయ్యారు. పార్టీ నాయకులు, ప్రముఖులతో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించి ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా మౌనంగా ఉంటున్నారు. కమల్‌ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లను పూర్తి చేయాల్సివుంది. అదే సమయంలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ముందుకు నడిపించాల్సి వుంది. ఈ రెండింటి నడుమ వందరోజులపాటు జరిగే బిగ్‌బాస్‌ సీజన్‌-4పై దృష్టిపెట్టి వారానికి రెండుసార్లు ఆ షోకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనాల్సి వుంది. ఓ వైపు సినిమా షూటింగ్‌లు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు, మధ్యలో బిగ్‌బాస్‌ కాంపేరింగ్‌ అంటూ కమల్‌ ఒకేసారి మూడు గుర్రాలపై స్వారీ చేయాల్సి వుంది. కానీ కమల్‌ ప్రస్తుతం రెండు గుర్రాలపైనే స్వారీ చేయడానికి సంసిద్ధమవుతున్నారు. పార్టీ గుర్రాన్ని పరుగులు తీయించేందుకు వెనుకాడుతున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి.


కరోనా బారి నుంచి ప్రజలను కాపాడటంలో అన్నాడీఎంకే ప్రభుత్వం విఫలమైందని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌ హాసన్‌ ట్విట్టర్‌లో చేసిన ప్రకటనలపై సీనియర్‌ మంత్రి డి. జయ కుమార్‌ ఘాటుగా స్పందించారు. ఐదు నెలలుగా మంత్రులంతా కరోనా నిరోధక పనుల్లో  ముమ్మరంగా పాల్గొంటుంటే కమల్‌హాసన్‌ ఎవరితోనూ సంబంధాలు లేకుండా బిగ్‌బాస్‌ గేమ్‌షోలో వందరోజులు గడిపి వచ్చినట్టుగా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజ మెత్తారు. మంత్రి మాటలు నూటికి నూరుపాళ్ళు వాస్తవమేనని మక్కల్‌ నీదిమయ్యం నిర్వాహకులే చెబుతున్నారు. ప్రస్తుతం కమల్‌ ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో పార్టీ ప్రముఖులకూ కూడా తెలియదు.


జనం ముందుకు రెండుసార్లు!

లాక్‌డౌన్‌ సమయంలో కమల్‌హాసన్‌ రెండు సార్లు జనం ముందుకు వచ్చారు. ‘ఇండియన్‌-2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబీకులకు ఆర్థిక సాయం అందించేటప్పుడు దర్శకుడు శంకర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఆ తరువాత చెన్నై వడపళనిలో పెప్సీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రెండు కార్యక్రమాలు సినీ రంగానికి సంబంధించినవే. ఆ తర్వాత ఆయన జూమ్‌యాప్‌ ద్వారా పుదుచ్చేరి పార్టీ నిర్వాహకులతో చర్చలు జరపటం, ఇటీవల జిల్లా కార్యదర్శులతో సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో బూత్‌కమిటీ ఇన్‌ఛార్జిలను నియమించాలని పార్టీ శ్రేణులకు సూచించడం మినహా ఆయన ముమ్మరంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.


కరోనా సహాయాలూ తక్కువే...

కొద్ది వారాల క్రితం కమల్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-4 ప్రోమోలో నటించారు. అక్టోబర్‌ నుంచి ఆ  షోలో పాల్గొనబోతున్నారని పార్టీ నిర్వాహకులు తెలిపారు. ఇక కరోనా లాక్‌డౌన్‌ బాధితులకు మక్కల్‌ నీది మయ్యం తరఫున గొప్పగా చెప్పుకోదగినంతగా సహాయ కార్యక్రమాలేవీ చేపట్టలేదు. ముఖ్యమంత్రి  పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్‌, బీజేపీ నేత మురుగన్‌ తదితర నాయకులంతా లాక్‌డౌన్‌ బాధితులను ఆదుకోవడంలో ఇప్పటికీ పోటీపడుతున్నారు. ఈ పెద్ద పార్టీలకు తోడుగా చిన్న పార్టీలు కూడా ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు, విటమిన్‌ మాత్రలు, రోగనిరోధక మందులు తమ శక్తికొద్దీ పంపిణీ చేస్తున్నాయి. అయితే కమల్‌హాసన్‌ గత ఆరుమాసాలుగా ఇంటి వద్దే గడుపుతున్నారు.


ఆ షోలో జనం ముందుకు వస్తారా?

ఇక వచ్చే నెల బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకైనా ఆయన జనం ముందుకు వస్తారా? లేక ఇంటిలోనో, ప్రత్యేకమైన షూటింగ్‌ స్పాట్‌లోనో పాల్గొంటారో తెలియటం లేదు. బిగ్‌బాస్‌ సీజన్‌-4షోలో వారానికి రెండుసార్లు శని, ఆదివారాల్లో బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్లతో భేటీ అవుతారు. ప్రేక్షకుల ఎదుట ఆ సీన్లు చిత్రీకరిస్తారు. చెన్నై ఈవీపీ సిటీలోని బిగ్‌బాస్‌ హౌస్‌ సమీపంలో నిర్మించే సెట్టింగ్‌లో ఆ దృశ్యాలు చిత్రీకరించటం ఆనవాయితీ. గత మూడేళ్ళుగా ఈ పద్ధతిలోనే కమల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ పద్ధతిలోనే గేమ్‌షోలో కమల్‌హాసన్‌ పాల్గొంటారా? లేక ప్రత్యేకమైన ప్రదేశం నుంచి బిగ్‌బాస్‌ పోటీదారులతో ముచ్చటిస్తారా? ఈ ప్రశ్నలపైనా సస్పెన్స్‌ కొనసాగుతోందని మక్కల్‌ నీదిమయ్యం నిర్వాహకులు చెబుతున్నారు.


జనవరి నుంచే పార్టీ కార్యక్రమాలు?

ఇదిలా ఉండగా ఈ యేడాది చివరి వరకు బిగ్‌బాస్‌ కాంపేరింగ్‌, పెండింగ్‌లో ఉన్న ‘ఇండియన్‌-2’ సినిమా షూటింగ్‌ పనుల్లో కమల్‌హాసన్‌ బిజీగా ఉంటారు. ఆ తర్వాతే పార్టీని అసెంబ్లీ ఎన్నికల దిశగా నడిపించేందుకు ఆయన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అంటే వచ్చే యేడాది జనవరిలోనే కమల్‌ పార్టీ కార్యక్రమాలపై తీవ్ర దృష్టి సారించనున్నారు. 


రాజకీయ సినిమాపై దృష్టి

అసెంబ్లీ ఎన్నికలకు మక్కల్‌ నీదిమయ్యం పార్టీ సిద్ధం చేయాల్సిన కమల్‌హాసన్‌ ప్రస్తుతం ఓ రాజకీయ కథకు సంబంధించిన సినిమాలో నటించేందుకు కాల్షీట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ చిత్రం కమల్‌  నటించనున్న 232వ చిత్రమవుతుంది. లోకేష్‌ కనక రాజ్‌ ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కమల్‌ ముందుగా పెండింగ్‌లో వున్న ‘ఇండియన్‌-2’ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత కొత్త సినిమా ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’లో నటించాలి. తాజాగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటించేందుకు కాల్షీట్లు ఇవ్వాల్సి వుంది. ఇవన్నీ ఈ డిసెంబర్‌లోగా పూర్తి చేసి జనవరి నుంచి పార్టీని అసెంబ్లీ ఎన్నికల వైపు నడిపించగలుగుతారా? అనేది సమాధానం తెలియని ప్రశ్నగా కనిపిస్తోంది.

Updated Date - 2020-09-21T13:55:36+05:30 IST