‘తృతీయ కూటమికి నేనే సీఎం అభ్యర్థిని’
ABN , First Publish Date - 2020-12-29T15:07:23+05:30 IST
తృతీయ కూటమిలో సీఎం అభ్యర్థిత్వంపై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తేల్చి చెప్పారు. తమ నేతృత్వంలోనే తృతీయ కూటమి ఏర్పాట వుతుందని, కూటమి నుంచి
చెన్నై : తృతీయ కూటమిలో సీఎం అభ్యర్థిత్వంపై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తేల్చి చెప్పారు. తమ నేతృత్వంలోనే తృతీయ కూటమి ఏర్పాట వుతుందని, కూటమి నుంచి తానే సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని పార్టీలు తమను సంప్రదిస్తున్నాయని, భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కూటమి ఏర్పాటుపై వచ్చే నెలలో స్పష్టత ఇస్తానని ఆయన వెల్లడించారు. మూడో విడత ఎన్నికల ప్రచారం కోసం తిరుచ్చి వెళ్లిన కమల్.. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తను ప్రచారానికి వెళ్లిన ప్రాంతాల్లో ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని, ముఖ్యంగా మహిళలు అధికంగా రావడం ఆనందం కలిగిస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఆడశిశువు జన్మిస్తే రూ.300, మగశిశువుకు రూ.500, జనన ధ్రువీకరణ పత్రం కావాలంటే ఆడపిల్లకు రూ.200, మగపిల్లలకు రూ.500 లంచం ఇవ్వాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, మరణ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులు, పట్టాల రిజిస్ట్రేషన్, ఆస్తి పన్ను, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్లు, వృద్ధాప్య, వింతతు పింఛన్లకు కూడా లంచం ఇవ్వాల్సిందేనని, లంచం లేనిదే ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరిగే అవకాశం లేదన్నారు. అవినీతిరహిత పాలన అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌తో కూడిన కంప్యూటర్ అంద జేస్తామని, స్వయంగా వెళ్లి పేపర్లు ఇవ్వకుండా ప్రజలు నేరుగా ఇంటి నుంచే సమస్యలను తెలిపేలా చర్యలు తీసుకుంటాన్నారు. ఇంటింటికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామని, అలాగని అవి ఉచితం కాదని, అవి ప్రభుత్వ పెట్టుబడిగా ఉంటాయన్నారు. ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను గౌరవించలేని దేశం అభివృద్ధి చెందలేదని, ఆ పరిస్థితికి మన దేశానికి రాకూడదు అనేది తమ పార్టీ అభిప్రాయమన్నారు. పార్టీ చిహ్నంగా టార్చ్ లైట్ పొందే విషయంలో అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తామన్నారు. చెన్నైతో సమానంగా రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు.