భారత రైతు నిరసనలపై కెనడా ప్రధాని కామెంట్!

ABN , First Publish Date - 2020-12-01T18:18:15+05:30 IST

కేంద్ర ఇటీవల రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుస్తున్నారు. చలిని కూడా లెక్కచేయకుండా.. రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలపై కెనడా ప్రధాని జస్టిట్ ట్రూడో కూడా స్పందించారు.

భారత రైతు నిరసనలపై కెనడా ప్రధాని కామెంట్!

టొరొంటో: భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రాజధాని ఢిల్లీ వెలుపల, గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల హోరు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను కూడా చేరడంతో ఆయన స్పందించారు. ‘భారత్‌లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి చింతిస్తున్నాము. అయితే మీకో విషయం చెప్పదలుకున్నా.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. సమస్యల పరిష్కారంలో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాం. మనందరం.. ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదే’ అని ఆయన కామెంట్ చేశారు. ఈ మేరకు జస్టిన్ ట్రూడో ఓ వీడియో పోస్ట్ చేశారు. భారత రైతులు చేపడుతున్న నిరసనలపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం.


ఇక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఆరో రోజుకు చేరింది. పలు రాష్ట్రాల రైతులతో పాటు పంజాబ్‌కు చెందిన రైతులు వేల సంఖ్యలో ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ నడిబొడ్డున నిరసన కార్యక్రమం చేపట్టేందుకు అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు ప్రయోగించిన వాటర్ క్యానన్లు, భాష్ప వాయువును సైతం లెక్క చేయక..వారు ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. 


కాగా రైతులతో ఈ రోజు చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే.. కొత్త చట్టాలను ఉపసంహరించుకునే అవకాశమే లేదని వారికి తేల్చి చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక కనీస మద్దతు ధర, ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ల విషయంలో వారి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్న ఈ కొత్త చట్టాల వల్ల కనీస మద్దతు ధర కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-01T18:18:15+05:30 IST