ఏపీకి జస్టిస్ బాగ్చీ
ABN , First Publish Date - 2020-12-17T08:00:44+05:30 IST
పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు జడ్జిలకు స్థానచలనం కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై అధికారిక ప్రకటన వెలువడింది.

తెలుగు రాష్ట్రాలు సహా నలుగురు సీజేల బదిలీ
నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు జడ్జిలకు స్థానచలనం కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై అధికారిక ప్రకటన వెలువడింది. దేశంలోని నలుగురు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. ఐదుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. అలాగే... మరో ఐదుగురు న్యాయమూర్తులను ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేసింది. తెలుగు రాష్ట్రాల చీఫ్ జస్టి్‌సలతో సహా పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సోమవారం కొలీజియం సిఫారసు చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.
ఏపీ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి స్థానంలో సిక్కిం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరిని సిక్కిం ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని తీర్మానించింది. అలాగే... కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
ఇక... తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ స్థానంలో ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లిని నియమించింది. జస్టిస్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ మురళీధర్‌ను రాత్రికి రాత్రి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్- హరియాణా కోర్టుకు బదిలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఒడిసా ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేయడం గమనార్హం.