రాహుల్ పాత వీడియో షేర్ చేసిన నడ్డా
ABN , First Publish Date - 2020-12-27T21:38:13+05:30 IST
రైతు చట్టాలపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ గాంధీకి ఆయనే గతంలో లోక్‌సభలో

న్యూఢిల్లీ: రైతు చట్టాలపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ గాంధీకి ఆయనే గతంలో లోక్‌సభలో మాట్లాడిన పాత వీడియోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారంనాడు షేర్ చేశారు. రైతు చట్టాలపై అప్పుడు అలా మాట్లాడి, ఇప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడటం ఏమిటంటూ నిలదీశారు.
ఉత్తరప్రదేశ్ రైతు గోడుపై రాహుల్ గాంధీ ఆ వీడియోలో మాట్లాడుతూ.... 'ఉత్తరప్రదేశ్ రైతు ఒకరు నన్ను అడిగారు. నేను కిలో బంగాళాదుంపలు రూ.2కు అమ్ముతున్నాను. మా పిల్లలు ఒక్కో పొటాటో చిప్స్ ప్యాకెట్ రూ.10కి కొంటున్నారు. ఆ మొత్తం ఒక దుంపకు సమానం. ఇదెలా సాధ్యం? అని నన్ను ప్రశ్నించారు. ఎలా జరిగి ఉండొచ్చని అనుకుంటున్నావని అడిగినప్పుడు, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి నేరుగా తమ ఉత్పత్తులు అమ్మలేక పోతుండటమే ఇందుకు కారణమని చెప్పాడు. దళారుల ప్రమేయం లేకుండా మా పంట మేమే నేరుగా ఫ్యాక్టరీలకు అమ్ముకునే అవకాశం ఉంటే ఆ లాభం మొత్తం మాకే దక్కుతుంది' అని రైతు చెప్పినట్టు రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమోదీ నియోజకవర్గం ఎంపీగా ఉన్న సమయంలో 2015లో అమేథీ ఫుడ్ పార్క్‌పై మాట్లాడినప్పటి వీడియో ఇది.
కాగా, గత సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాలతో చిన్న రైతులకు ఆంక్షల నుంచి విముక్తి లభిస్తుందని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. దళారుల ప్రమేయం లేకుండా చేసి రైతుల ఆదాయం పెంచేందుకు ఈ చట్టాలు భరోసాగా ఉంటాయని ప్రభుత్వ వాదనగా ఉంది. అయితే, భారీ భూస్వాముల దయాదాక్షిణ్యాలపై తాము ఆధారపడాల్సి వస్తుందంటూ రైతు సంఘాలు ఈ చట్టాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చల్లో ప్రతిష్ఠంబన నెలకొన్న నేపథ్యంలో ఈనెల 29న ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రైతు సంఘాలు తాజాగా ప్రతిపాదించాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల మధ్య ఇవి ఆరో విడత చర్చలు కానున్నాయి.