సంస్కరణ ఫలితాలను.. విద్యార్థులు అనుభవిస్తున్నారు
ABN , First Publish Date - 2020-12-28T08:28:01+05:30 IST
‘‘సంస్కరణలు కొందరికి త్వరగా రుచించవు. అందుకే వారు వివాదాలు సృష్టిస్తారు. నేను వీసీగా నాలుగేళ్ల కాలంలో పెద్ద ఎత్తున సంస్కరణలను తీసుకువచ్చా. వినూత్న మార్పులు చేశా. అందుకే వివాదాలు చెలరేగాయి. అయితే.. విద్యార్థులు ఇప్పుడు ఆ సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్నారు’’ అని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఉప కులపతి మామిడ్యాల జగదీశ్‌కుమార్ చెప్పారు...

- మార్పులను ప్రతిఘటించినవారే వివాదాలు సృష్టించారు
- విద్యార్థుల భవిష్యత్తు కోసమే కీలక నిర్ణయాలు
- ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతర కృషి
- ప్రపంచంలోని టాప్-500 వర్సిటీల్లో స్థానానికి ప్రయత్నాలు
- ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో జేఎన్‌యూ వీసీ జగదీశ్‌కుమార్
న్యూఢిల్లీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘సంస్కరణలు కొందరికి త్వరగా రుచించవు. అందుకే వారు వివాదాలు సృష్టిస్తారు. నేను వీసీగా నాలుగేళ్ల కాలంలో పెద్ద ఎత్తున సంస్కరణలను తీసుకువచ్చా. వినూత్న మార్పులు చేశా. అందుకే వివాదాలు చెలరేగాయి. అయితే.. విద్యార్థులు ఇప్పుడు ఆ సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్నారు’’ అని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఉప కులపతి మామిడ్యాల జగదీశ్‌కుమార్ చెప్పారు. తాను చేసిన మార్పుల్ని వ్యతిరేకిస్తూ.. కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళనకు దిగారని, తనపైన.. తన కార్యాలయంపైన, ప్రయోగశాలలపైన దాడులు చేశారని తెలిపారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్ కోసమే కీలక నిర్ణయాలు తీసుకున్నాని వివరించారు. వీసీగా ఆయన పదవీకాలం త్వరలో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆన్‌లైన్ వ్యాలుయేషన్‌కు శ్రీకారం
జేఎన్‌యూ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలను కంప్యూటర్ ద్వారా దిద్దేలా.. ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కు శ్రీకారం చుట్టానని జగదీశ్‌కుమార్ వివరించారు. ఇందుకోసం జాతీయ పరీక్షల విభాగం(ఎన్‌టీఏ) సహకారం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమైన జేఎన్‌యూలో.. అన్ని ప్రాంతాల వారికి.. అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించేందుకు కృషిచేశానన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రైవేట్‌గా చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఒక్కో ప్రొఫెసర్ వద్ద ఉండే రిసెర్చ్ విద్యార్థుల సంఖ్యను 40 నుంచి 8కి కుదించి, పరిశోధనల్లో ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషిచేశానన్నారు. ట్యూషన్ ఫీజుల్లో మార్పులు లేకుండా.. హాస్టల్ ఫీజులను సవరించినట్లు తెలిపారు.
ప్రమాణాలు పెంచే దిశలో..
జేఎన్‌యూ ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతోనే వీసీగా బాధ్యతలు చేపట్టానని జగదీశ్‌కుమార్ వివరించారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అటల్ బిహారీ వాజపేయి స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, సెంటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, స్కూల్ ఆఫ్ టీచింగ్ విభాగాలను ప్రారంభించడమే కాకుండా.. ఆయుర్వేద లాంటి కోర్సులను ప్రవేశపెట్టామని చెప్పారు. ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. జేఎన్‌యూ ద్వారా వందకు పైగా స్టార్టప్ కంపెనీలు పురుడుపోసుకునేందుకు కృషిచేశానని వివరించారు. నూతన విద్యావిధానంపై ఏర్పాటైన కస్తూరి రంగన్ కమిటీ సూచించిన పలు ప్రతిపాదనలను ఎప్పుడో అమలు చేశానని చెప్పారు. ప్రపంచంలోని ప్రఖ్యాత 500 విశ్వవిద్యాలయాల్లో జేఎన్‌యూ స్థానం పొందేలా చర్యలు వేగవంతం చేశామన్నారు.1952 తర్వాత..2018లో తొలిసారి స్నాతకోత్సవాలు తిరిగి ప్రారంభించానన్నారు. వీటిని కూడా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయన్నారు.
ఐఐటీ-ఢిల్లీలో బోధనను వీడలేదు
విద్యార్థులు ప్రశ్నించి తమ జిజ్ఞాసను తీర్చుకోవాలని ఆయన అభిలషించారు. భారతీయ సంస్కృతి ఇదే చెబుతోందని.. అదే సమయంలో కాలానుగుణంగా అవసరమైన, ఆరోగ్యకరమైన మార్పులను అడ్డుకోరాదని ఆయన హితవు పలికారు. వీసీగా ఉన్నా ఇప్పటికీ ఐఐటీ-ఢిల్లీలో బోధిస్తున్నానని, పరిశోధనలను ఏనాడూ ఆపలేదని తెలిపారు. విద్యార్థులకున్న సైద్ధాంతిక దృక్పథాలతో తనకు సంబంధం లేదన్నారు. యూనివర్సిటీలో ఏ సంఘటన జరిగినా పరిపాలనాధికారిగా తాను చర్యలు తీసుకోక తప్పదని వివరించారు. తన హయాంలో ఒక విద్యార్థి అదృశ్యమయ్యాడని, పోలీసులు వెతికినా దొరకలేదని, అతడు ప్రతిభ గల విద్యార్థి అని వీసీ ఆవేదన వ్యక్తం చేశారు.
బయటి వ్యక్తులతోనే ఉద్రిక్తత
బయటి వ్యక్తులతోనే వర్సిటీలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయని జగదీశ్‌కుమార్ వెల్లడించారు. జనవరిలో కొందరు బయటి వ్యక్తులు వర్సిటీలో ప్రవేశించారని తెలిసిన వెంటనే సెక్యూరిటీని పంపానని, వారి సంఖ్య సరిపోకపోవడంతో పోలీసులను పిలవాల్సి వచ్చిందన్నారు. ఆనాడు జరిగిన హింసాకాండపై దర్యాప్తు జరుగుతోందని, ఈలోగా కరోనా రావడంతో ఆన్‌లైన్ తరగతులపై దృష్టి పెట్టామని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే సెమిస్టర్‌ను పూర్తిచేసి.. పరీక్షలను నిర్వహించామని, పీహెచ్‌డీ పరిశోధనలను కూడా అన్‌లైన్‌లోనే స్వీకరించామని చెప్పారు.
వ్యాయామం అంటే ఇష్టం
తనకు కరాటే, వ్యాయామం అంటే ఇష్టమని.. జిమ్‌కు వెళ్తుంటానని జగదీశ్‌కుమార్ వివరించారు. సంగీతం తన అభిరుచి అని చెప్పారు.